పొత్తుల గురించి ఎవరు మాట్లాడినా ఔట్‌: రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్‌

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ ఆ పార్టీ నేత‌ల‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. పొత్తుల విష‌యంలో కాంగ్రెస్‌లో ఎవ‌రూ నోరు మెద‌పొద్ద‌ని గ‌ట్టిగానే చెప్పారు. ఇలా ఎవ‌రు మాట్లాడినా.. పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. అంతేకాదు.. టీఆర్ ఎస్‌, బీజేపీతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగే నాయ‌కుల‌కు కూడా పార్టీలో చోటు లేద‌న్నారు. హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రాహుల్‌.. ఆ సాంతం వాడి వేడిగా మాట్లాడారు.

తెలంగాణలో ఒక వ్యక్తి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్ము వేల కోట్లు మింగింది ఎవరో ప్రజలకు తెలుసు. ప్ర‌జలను మోసం చేసిన వారితో కాంగ్రెస్‌కు సంబంధం ఉండదు. మోసపూరిత పార్టీలతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. పొత్తుల గురించి కాంగ్రెస్‌లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తాం. టీఆర్ ఎస్‌, బీజేపీతో అనుబంధముండే వాళ్లు కాంగ్రెస్‌లో ఉండొద్దు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్‌, బీజేపీని ఓడిస్తాం. టీఆర్ ఎస్‌, బీజేపీతో కాంగ్రెస్‌ నేరుగా పోరాడుతుంది. తెలంగాణ యువతను మోసం చేసిన వారిని గద్దె దించుతాం. అని రాహుల్ వ్యాఖ్యానించారు.

ప్రజల అభిమానం పొందిన వారికే ఈసారి టికెట్లు ఇస్తామ‌ని రాహుల్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. నిజమైన ప్రజాసేవ ఎవరు చేస్తున్నారో పార్టీ గమనిస్తోందన్నారు. ప్రజల మధ్య ఉండని వారికి ఈసారి టికెట్లు దక్కవని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్‌ విధివిధానాలను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు పిలిచినా వస్తానని ఆయ‌న హామీ ఇచ్చారు. టీఆర్ ఎస్‌పై పోరాటం కూడా కొనసాగుతుందద‌న్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఇప్పటికే కలిసి పనిచేశాయని విమ‌ర్శించారు. టీఆర్ ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం ఉంద‌న్నారు. మోడీ ప్రభుత్వానికి టీఆర్‌ఎస్‌ సహకరిస్తోందన్నారు.

మోడీ 3 నల్ల చట్టాలను తీసుకొస్తే టీఆర్‌ఎస్‌ సహకరించిందని తెలిపారు. తెలంగాణలో సొంతంగా గెలవలేమని బీజేపీకి తెలుసున‌ని నిప్పులు చెరిగారు. తెలంగాణ సులువుగా ఏర్పడిన రాష్ట్రం కాదన్న రాహుల్‌.. ఎంతో మంది త్యాగాల మీద తెలంగాణ సాకారమైందన్నారు. తెలంగాణ ఒక వ్యక్తి, ఒక కుటుంబం కోసం ఏర్పాటు చేయలేదంటూ.. ప‌రోక్షంగా కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు గడిచినా ప్రజల కష్టాలు తీరలేదన్నారు. తెలంగాణ ప్రజల కలలను కేసీఆర్‌ సర్కార్‌ నెరవేర్చలేదని దుయ్య‌బ‌ట్టారు.

తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేద‌న్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్‌ ఎంతో పోరాటం చేసిందని రాహుల్ అన్నారు. ఆత్మదానాలకు చలించిపోయి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసీ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. తెలంగాణ ఇస్తే రైతులు, ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించామ‌ని తెలిపారు. ప్రజలు, నిరుద్యోగులు, కాంగ్రెస్‌ ఆశించిందేదీ నెరవేరలేదని విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతుల సమస్యలను టీఆర్ ఎస్‌ ప్రభుత్వం వినిపించుకోవట్లేదన్నారు.

దేశంలో, రాష్ట్రంలో పంటలకు మద్దతు ధర దొరకట్లేద‌ని రాహుల్ విమ‌ర్శించారు. చరిత్రాత్మకమైన వరంగల్‌ డిక్లరేషన్‌ను ప్రకటిస్తున్నామ‌న్న ఆయ‌న కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుంద‌ని హామీ ఇచ్చారు. ఏ ఆశయంతో తెలంగాణ ఇచ్చామో అది సాధిస్తామ‌న్నారు. ఎకరానికి రూ.15 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తామ‌న్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ కచ్చితంగా అమలవుతుందని హామీ ఇస్తున్నాన‌ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాహుల్ చెప్పారు.