తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఏంటో? ఆయన అనుసరించే విధానాన్ని సహజ శైలిగా భావించాలా లేకపోతే తమను ఇరకాటంలో పడేసే గేమ్ ప్లాన్ అనుకోవాలో తెలియక బీజేపీ నేతలు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారట.
కరోనా కష్టకాలం తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలో అనుసరించిన వైఖరిని… ఇప్పుడు విరుచుకుపడుతున్న విధానాన్ని విశ్లేషిస్తున్న కమలనాథులు తమను గులాబీ పెద్ద టార్గెట్ చేశారని డిసైడ్ అవుతున్నారు.
భారతదేశంలో కరోనా విస్తృతి మొదలైన తరునంలో మిగతా రాజకీయ పార్టీలు కేంద్రాన్ని నిందించినా…తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం కేంద్రాన్ని పల్తెత్తు మాట అనలేదు. ప్రధాని ఇచ్చిన ప్రతి పిలుపును పాటించారు. పైగా ప్రధానిని విమర్శించిన వారిని సైతం అడ్డుకుని, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిని గౌరవించాలని క్లాసు పీకారు. వీడియో కాన్ఫరెన్సులలో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు.
తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్‌ను విమర్శించినా ఆయన లైట్ తీసుకున్నారు. బీజేపీ ఢిల్లీ నేతలు సైతం కేసీఆర్ సర్కారుపై పెద్దగా కామెంట్లు చేయలేదు. అయితే, తాజాగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వర్చువల్ ర్యాలీలో తెలంగాణ సర్కారుపై దుమ్మెత్తిపోయడం, దానిపై కేసీఆర్ టీం మరిన్ని సంచలన కామెంట్లు చేయడంతో సీన్ మారిపోయింది.
తెలంగాణలో ప్రభుత్వం తక్కువ కరోనా టెస్టులు చేయిస్తోందని, అసలు టెస్టుల విషయంలో టీఆర్ఎస్ సర్కారును మిత్రపక్షమైన మజ్లిస్ కంట్రోల్ చేస్తోందని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలంతా టీఆర్ఎస్ తీరును ఎండగట్టాలని, కేసీఆర్ సర్కారుపై చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. దీంతో, అప్పటివరకు డైలామాలో ఉన్న తెలంగాణ బీజేపీ నేతలకు ఓ క్లారిటీ వచ్చేసింది.
కరోనాపై కేసీఆర్ సర్కారు చర్యలను ఢిల్లీ నుంచి వచ్చిన బృందం అభినందించడం, బీజేపీ పెద్దలతో కేసీఆర్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో కమలనాథులు దూకుడు తగ్గించుకోవాలని భావించారు. ఇదే సమయంలో నడ్డా పిలుపుతో వారు తమ విమర్శల ఉధృతిని పెంచారు.
అయితే, బీజేపీ తమపై ఎదురుదాడి చేస్తుండటంతో టీఆర్ఎస్ సైతం సంయమనం వహించడం సరైంది కాదనే దోరణికి వచ్చేసింది. అందుకే దేశంలో ఏపార్టీ చేయని విమర్శలను మోదీ సర్కారుపై చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తుంటే.. కొందరు నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తమ రాజకీయ ప్రయోజనం కోసం హాస్పిటల్ ముందు ధర్నాలు చేయడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో వైరస్ నిర్ధారణ పరీక్షలు తక్కువ చేస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు వారి ప్రభుత్వం చేసిన ఘనకార్యాన్ని తెలుసుకోవాలని హితవు చెప్పారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.214 కోట్లు మాత్రమే నిధులిచ్చి చేతులు దులుపుకొన్నదని చెప్పారు.
దీపాలు వెలిగించండి.. చప్పట్లు కొట్టండి అంటూ మాటలకే పరిమితమైన కేంద్రం.. చేతల్లో చేసిందేమీ లేదని విమర్శించారు. రోజుకి 3,500 నుంచి నాలుగువేల పరీక్షలు చేయగల సామర్థ్యమున్న కోబాస్- 8800 మిషన్లను దేశంలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్‌చేస్తే.. భారత్‌కు రాగానే కోల్‌కతాకు తరలించుకొనిపోయిన కేంద్ర వైఖరిని మంత్రి ఈటల తీవ్రంగా తప్పుపట్టారు.
కేంద్ర ప్రభుత్వం తప్పులను పక్కనపెట్టి పరీక్షలు తక్కువచేస్తున్నారంటూ విమర్శలుచేయడం వారి కుసంస్కారానికి నిదర్శనమన్నారు. తమ ప్రాజెక్టులపై ఆరోపణలు చేస్తున్నవారు గుజరాత్‌లో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కూడా కమిషన్ల కోసమే కడుతున్నారా? అంటూ మరే పార్టీ వేయని సంచలన ప్రశ్న వేశారు. మొత్తంగా…ఇప్పుడు బీజేపీ,టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం రసపట్టుకు చేరిందని అంటున్నారు.