గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.5 కోట్లు, ఇంటి స్థలం, ఆయన భార్య సంతోషికి గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.
ఈ ప్రకటన వెనుక రాజకీయ కోణం ఉన్నదని భావించిన వారు లేదా సోషల్ మీడియా, ప్రతిపక్షాల ప్రోద్భలం ఉందని భావించినప్పటికీ, ఏదేమైనా అంతకు మించి ఆర్మీలో చేరాలనుకునే వారికి భరోసా కల్పించినట్లవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికీ కొంతమంది ఆర్మీలోకి వెళ్లేందుకు ఆసక్తి కనబరచని వారు ఉన్నారు లేదా తల్లిదండ్రులు కూడా పంపించేందుకు భయపడేవారు ఉంటారు. కానీ ఇలాంటి ప్రకటన వల్ల ఆ కుటుంబానికి భరోసా కల్పించడంతో పాటు తమకు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుండి సరైన గౌరవం దక్కుతుందనే అభిప్రాయం చాలామందిలో రావడానికి ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు.
దేశం మీద ప్రేమతో ఎవరైనా ఆర్మీలోకి వెళ్దామనుకునే వారు ఉంటారు. అయితే తన తర్వాత తన ఫ్యామిలీ ఏమిటనే ప్రశ్న ఉదయించి ఆగిపోయే వారు ఉంటారు. అలాంటి వారికి తన కుటుంబం జీవితం సాఫీగా సాగిపోతుందనే భరోసా ఇచ్చేందుకు ఇలాంటి ప్రకటనలు ఉపయోగ పడతాయంటున్నారు.
కేసీఆర్ ప్రకటన దేశమంతా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో అంతకుమించి సూర్యాపేట, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. కేసీఆర్ సంతోష్ బాబు అంత్యక్రియలకు హాజరుకాకపోవడం విమర్శలకు తావిచ్చి ఉండవచ్చు. ఈ రాజకీయ విమర్శల భయంతో ఆ తర్వాత నేరుగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలిసి వీటిని అందించవచ్చు. ఈ రాజకీయ అంశాలు పక్కన పెడితే మాత్రం ఇక ముందు ఆర్మీలోకి వెళ్లేవారికి లేదా వారి కుటుంబానికి భరోసా, గౌరవం కచ్చితంగా ఉంటుందనే అభిప్రాయం మాత్రం ప్రజల్లోకి వెళ్తుందంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates