కొడాలిపై చంద్ర‌బాబు కొత్త అస్త్రం

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని.. గుడివాడ నియోజ‌క వ‌ర్గంలో విజ‌యం సాధించి.. చంద్ర‌బాబుకు.. కానుకగా ఇచ్చేందుకు యువ‌నాయ‌కుడు రెడీ అయ్యార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న‌ను హైలెట్ చేసేందుకు పార్టీ ఐ-టీడీపీ విభాగానికి ఆదేశాలు కూడా అందాయ‌ని అంటున్నారు. ఇప్పుడు టీడీపీలో ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. గుడివాడ‌లో విజ‌యం అత్యంత అవ‌స‌రం. ఇప్ప‌టికే ప‌లుమార్లుగా టీడీపీ ఇక్క‌డ ప‌రాజ‌యం పాల‌వుతోంది.

పైగా.. ఇక్క‌డ నుంచి గెలిచిన కొడాలి నాని.. టీడీపీకి కంట్లో న‌లుసుగా మారిపోయారు. త‌న‌ను ఓడించే టీడీపీ నాయ‌కుడు ఇప్ప‌టి వ‌ర‌కు పుట్ట‌లేద‌ని కూడా అంటున్నారు. అంతేకాదు.. ఎక్క‌డ ఎప్పుడు మాట్లాడినా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ఆయ‌న నోరు చేసుకుంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించార‌ని.. పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక్క‌డి ప్రాంతానికే చెందిన యువ నాయ‌కుడు బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన శిష్ట్లా లోహిత్‌ను పోటీ చేయించాల‌ని భావిస్తున్నార‌ట‌. శిష్ట్లా లోహిత్ ఫ్యామిలీకి రాజకీయాలు కొత్త‌కాదు. ఆయ‌న తండ్రి కూడాగ‌తంలో రాజ‌కీయాలు చేశారు. పైగా ఆద‌ర్శ‌నేత‌గా కూడా ఆయ‌న‌కు పేరు ఉంది. దీనికితోడు.. రియ‌ల్ ఎస్టేట్ స‌హా.. ప‌లు వ్యాపారాల్లో లోహిత్ మంచి ఫాంలో ఉన్నారు.

ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డంతోపాటు.. త‌న సామాజిక‌వర్గంలోను.. వ్యాపార ప‌రంగా క‌మ్మ సామాజిక వ‌ర్గంలోనూ ఆయ‌న మంచి పేరు తెచ్చుకున్నారు. అంద‌రిలోనూ.. గుర్తింపు కూడా పొందారు. వ‌య‌సు కూడా చాలా చిన్న‌వ‌యసు కావ‌డం గమ‌నార్హం. దీంతో.. లోహిత్‌ను గుడివాడ‌లో నిలబెట్ట‌డం ద్వారా.. డిఫ‌రెంట్ లుక్‌తో రాజ‌కీయాలు చేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టు పార్టీలో చ‌ర్చ సాగుతోంది.

వాస్త‌వానికి గుడివాడ‌లో టీడీపీకి నాయ‌కులు ఉన్నా.. వారు ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు వేయించుకోలేక పోతున్నార‌ని.. పార్టీ అధిష్టానం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చింది. అయితే.. వారిని ప‌క్క‌న పెట్ట‌కుండా.. లోహిత్ కు టికెట్ ఇచ్చి.. పార్టీలో కీల‌క ప‌ద‌వుల‌ను పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. వారికి ప్ర‌భుత్వంలోనూ కార్పొరేష‌న్ ప‌ద‌వులు అప్ప‌గించాలని ఆలోచిస్తున్నార‌ట‌.

లోహిత్ అయితే.. యువ‌కుడు, ఉత్సాహ‌వంతుడు.. ఎలాంటి ఆరోప‌ణ‌లు లేని సౌమ్యుడు కావ‌డంతో గుడివాడ ప్ర‌జ‌లు రిసీవ్ చేసుకుని.. కొత్త నాయ‌కుడికి.. ప్రాధాన్యం ఇస్తార‌ని భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.