ఏపీ లెక్క‌లు: 3 ఏళ్ల అప్పులు 3 వారాల్లో తేలిపోయాయా ?

ఓ వైపు ప‌న్నుల లెక్క‌లు తేల‌డం లేదు. మ‌రోవైపు కేంద్రం అందించే సాయం ఎంత‌న్న‌ది స్ప‌ష్టం కావ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో ఆంధ్రావ‌ని చేసిన అప్పులు ఎంత ఏ మేరకు ఉన్నాయి అన్న‌వి కూడా ఎవ్వ‌రూ వెల్ల‌డి చేయ‌డం లేదు. పైకి చెప్పేవి ఏవీ నిజం కావు అని గ‌తంలోనే తేలిపోయింది. భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు ఉప‌యోగించాల్సిన నిధుల‌ను కూడా ప్ర‌భుత్వం వాడుకుంటోంది. ఆఖ‌రికి విప‌త్తు నివార‌ణ‌కు సంబంధించిన నిధులు కూడా వాడుకుంటుంది అని వార్త‌లు వ‌స్తున్నాయి.

అయినా కూడా ఓ ప్రభుత్వం త‌న తాహ‌తుకు మించి సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్రేమ పెంచుకున్న కార‌ణంగానే ఈ విధంగా ప్ర‌తిరోజూ అప్పుల కోస‌మే  నానా అవ‌స్థ‌లూ ప‌డాల్సి వ‌స్తోంద‌ని నిపుణులు అంటున్నారు. బ‌డ్జెట్ లో చూప‌కుండా చేసిన ఖ‌ర్చుల లెక్క‌లు తేల్చాల్సిందేన‌ని,
లేదంటే దాన్ని కూడా ఓ ఆర్థిక నేరం కింద‌నే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్న మాట. ఇవేవీ ప‌ట్టించుకోకుండా ఇష్టానుసారం అప్పులు తేవ‌డం అందుకు ప్ర‌త్యేక స‌ల‌హాదారుల‌ను నియ‌మించుకోవ‌డం అన్న‌వి జ‌గ‌న్  స‌ర్కారుకే చెల్లాయ‌ని విప‌క్షం ఆరోపిస్తోంది.

అప్పులకు సంబంధించి మాట్లాడాల్సినంత మాట్లాడాలి. ఓ రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీస్తే ఆ త‌ప్పిదంలో కేంద్రానికి కూడా వాటా ఉంటుంది. అందుకే  గ‌తం క‌న్నా ఇప్పుడు మెరుగైన రీతిలో అప్పుల వివ‌రాల సేక‌ర‌ణ‌కు కేంద్రం స‌మాయత్తం అయిందని ప్ర‌ధాన మీడియా వెల్ల‌డిస్తోంది. మూడేళ్ల అప్పుల‌కు సంబంధించి గ‌డిచిన మూడు వారాల్లో స‌చివాల‌య అధికారులు క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేసి కేంద్రానికి డేటా పంపారని తెలుస్తోంది. ఆ విధంగా చూసుకంటే ఇప్ప‌టిదాకా అప్పుల లెక్క‌లు నాలుగు ల‌క్ష‌ల కోట్ల‌కు పైగానే అని తేలిపోయింది. గ‌తం లో చేసిన అప్పుతో క‌లిపితే ఏడు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అని తేలిపోయింది. మూడేళ్ల‌లో సంక్షేమానికి వెచ్చించిన మొత్తం ప్ర‌భుత్వ చెప్పిన ప్ర‌కారం ల‌క్షా 35 వేల కోట్ల రూపాయ‌లు అని నిర్థార‌ణ అయింది.

ఇవ‌న్నీ పైకి క‌నిపిస్తున్న లెక్క‌లు కానీ బ‌డ్జెట్లో చూపించ‌కుండా తెచ్చిన అప్పులు, చేసిన ఖ‌ర్చుల వివ‌రాలు పోగేసేందుకు కేంద్రం స‌మాయ‌త్తం అయింది. ఆ విధంగా ఏపీ స‌ర్కారు మ‌రో సారి ఇర‌కాటంలో ప‌డిపోయింది. ఇప్ప‌టికే ఆస్తుల‌ను తాక‌ట్టు పెట్టి మ‌రీ ! అప్పులు తెచ్చే మార్గాల‌ను సుగ‌మం చేయాల‌ని భావిస్తున్నా అవేవీ అంత‌గా నిబంధ‌న‌ల కార‌ణంగా వ‌ర్కౌట్ కావ‌డం లేదు. కొన్ని చోట్ల ప్ర‌భుత్వ ఆస్తుల వేలం కూడా సాధ్యం చేసే విధంగా స‌మాయ‌త్తం అయినా అది కూడా ముందుకు పోలేదు. ముఖ్యంగా అమ‌రావ‌తి భూముల‌ను ప్ర‌ధాన ఆస్తిగా చూపించి అప్పులు తెచ్చినా కూడా స‌ర్కారుకు గండం తీర‌లేదు. గ‌తంలో వ‌చ్చిన వార్త‌ల‌ను చూస్తే కొన్ని భూముల‌ను తాకట్టులో ఉంచి రెండు వేల కోట్ల‌కు పైగా అప్పులు తెచ్చారు. అవి కూడా స‌రిపోలేదు. విశాఖ కేంద్రంగా కూడా కొన్ని ఆస్తుల‌ను బ్యాంకు గ్యారంటీగా చూపించి లోన్లు తెచ్చారు. అవి కూడా సరిపోలేదు.