వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) దెబ్బ పడినట్లే ఉంది. నిజానికి పీకే చేరిక వల్ల కాంగ్రెస్ బలోపేతం అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే మిగిలిన దేశంలో పరిస్ధితి ఎలాగున్నా తెలంగాణా మాత్రం కాంగ్రెస్ పై దెబ్బ పడినట్లే అనుకుంటున్నారు. ఎలాగంటే జాతీయస్థాయిలో కాంగ్రెస్ పునరుత్ధానాకి పీకే పెద్ద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
పరిస్థితులన్నీ కలిసొస్తే చాలా తొందరలోనే పీకే కాంగ్రెస్ లో చేరటం గ్యారెంటీ. అంటే తొందరలోనే పీకే కాంగ్రెస్ నేత కమ్ వ్యూహకర్తగా మారబోతున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కేసీయార్ కోసం పీకే పనిచేస్తున్నారు. అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ రెండు పార్టీలు బద్ధ వ్యతిరేకం. అలాంటి రెండు పార్టీలతో పీకే ఏకకాలంలో ఎలా పనిచేయగలరు ? ఇక్కడే సీన్ లోకి బీజేపీ ఎంటరయ్యింది.
కాంగ్రెస్-టీఆర్ఎస్ లు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు బీజేపీ చీఫ్ బండి సంజయ్ అండ్ కో మొదలు పెట్టేశారు. కేసీయార్ పైన కాంగ్రెస్ నేతల ఆరోపణలు, విమర్శలన్నీ నాటకాలే అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనలు, నిరసనలంటు జనాలను తప్పుదోవ పాటిస్తున్నారన్న బండి ఆరోపణలకు హస్తం పార్టీ నేతలు ధీటైన సమాధానం ఇవ్వలేక పోతున్నారు.
అందుకనే తమతో కలిసి పని చేయాలంటే ఇతర పార్టీలతో అన్ని రకాల సంబంధాలు తెంచుకోవాలని కాంగ్రెస్ షరతులు విధించినట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అయితే రేవంత్ మాటలను జనాలు నమ్ముతారా ? ఎందుకంటే తనకు బదులుగా టీఆర్ఎస్ కు తన సంస్థ ఐప్యాక్ పనిచేస్తుందని పీకే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. పీకే వేరు ఐప్యాక్ వేరు కానపుడు టీఆర్ఎస్ కోసం పీకే పని చేస్తే ఏమిటి ? పీకే సంస్థ ఐప్యాక్ పని చేస్తే ఏమిటి ? అందుకనే తెలంగాణా కాంగ్రెస్ పై పీకే దెబ్బ పడినట్లే అనుమానంగా ఉంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.