మంత్రి అయ్యాక ఆమె మారిపోయార‌బ్బా!

వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మందికి ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. పపార్టీ త‌ర‌ఫున‌, ప్ర‌భుత్వం త‌రఫున కూడా వీరు గ‌ట్టివాయిస్ వినిపించారు. మీడియా ముందు.. తీవ్ర వ్యాఖ్య‌లు చేసి.. నిరంత‌రం ట్రోల్ అయ్యారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్‌.. స‌హా.. జ‌న‌సేన‌పై విరుచుకుప‌డేవారు. ఇలాంటి వారిలో ఒక‌రిద్దరు మరింత పేరు తెచ్చుకున్నారు. వీరిలో ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాకు చెందిన న‌గ‌రి ఎమ్మెల్యే రోజా కీల‌క పాత్ర‌లో క‌నిపించేవారు.

ఆమె నోరు విప్పితే సంచ‌ల‌న కామెంట్లు అల‌వోక‌గా వ‌చ్చేవి. స‌వాళ్ల‌కు, ప్ర‌తిస‌వాళ్ల‌కు కూడా ఆమె కీల‌కంగా మారేవారు. దీంతో రోజా రేంజ్ ఓ రేంజ్‌లో సాగింది. ఇక‌, త‌న‌కు ఇబ్బంది వ‌చ్చినా. ఆమె అదే రేంజ్‌లో రియాక్ట్ అయిన సంద‌ర్భాలు ఉన్నాయి. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న రాజ‌కీయాల‌పైనా.. ఆమె.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసేశారు.  అయితే.. ఇప్పుడు రోజాకు జ‌గ‌న్ ప్ర‌మోష‌న్ ఇచ్చారు. త‌న కేబినెట్ 2.0లోకి రోజాను తీసుకున్నారు. ఇలా ఎందుకు చేశారంటే… మ‌రింత‌గా ప్రోత్స‌హించేందుకేన‌ని అంటున్నారు.

అయితే.. దీనికి భిన్నంగా రోజా .. ఇప్పుడు ఎక్క‌డా మీడియా ముందుకు రావ‌డం లేదు. మంత్రివ‌ర్గంలో చోటు ఇచ్చి.. ఇప్ప‌టికి 15 రోజులు అయింది. ఇన్నిరోజుల్లో ఎక్క‌డా ఆమె.. మీడియా ముందుకు రావ‌డం కానీ, గ‌తంలో మాదిరిగా.. ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డ‌డం కానీ.. క‌నిపించ‌డం లేదు. ఈ ప‌దిహేను రోజుల్లో రాష్ట్రంలో రెండు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక‌టి.. ఒంగోలులో ఓ కుటుంబం వెళ్తున్న కారును ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకోవ‌డం అయితే.. రెండోది విజ‌య‌వాడ‌లో ఓ యువ‌తిపై అత్యాచారం ఘ‌ట‌న‌.

ఈ రెండు విష‌యాల‌పైనా.. ప్ర‌తిప‌క్షం టీడీపీ నిప్పులు చెరిగింది. జ‌గ‌న్ అస‌మ‌ర్థ‌పాల‌కుడంటూ.. కామెంట్లు చేసింది. అంతేకాదు.. ఆయ‌న త‌క్ష‌ణం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని కూడా వ్యాఖ్యానించింది. నిజానికి వైసీపీని, జ‌గ‌న్‌ను ఏమైనా అంటే.. అస్స‌లు ఊరుకోని.. రోజా.. ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. పోనీ నామ‌మాత్రంగా కూడా స్పందించ‌లేదు. దీంతో మంత్రి అయ్యాక ఆమె మారిపోయార‌బ్బా! అనే మాట వినిపిస్తోంది. దీనికి కార‌ణం ఏంటి? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు.. ప‌రిస్థితి వేరు.. ఇప్పుడు మంత్రిగా ఉన్న‌ప్పుడు ప‌రిస్థితి వేరు! అని త‌న‌ను తాను ఆమె మార్చుకున్నారేమో.. అనే గుస‌గుస వినిపిస్తోంది.