అవంతి సైలెంట్ .. గంటా హైలెట్?

రాజ‌కీయాల్లో ఏవీ స్థిరం అయి ఉండ‌వు. ఉండాల‌ని అనుకోకూడ‌దు కూడా ! ఎందుకు ఉండాలి కొన్ని గాలివాటు గ‌మ‌నాలు కూడా ఉంటాయి. ఉండాలి కూడా ! అదే అంటే ఆ ప‌ద్ధ‌తే కొన్ని సార్లు మంచి ఫ‌లితాలు ఇవ్వ‌వ‌చ్చు కూడా ! ప‌ద్ధ‌తి త‌ప్పి రాయ‌డం కూడా ఓ ప‌ద్ధ‌తే క‌దా ! అదేవిధంగా ఎటువంటి రూల్స్ నూ  పాటించ‌క ఇష్టం వ‌చ్చిన విధంగా రాజ‌కీయ  అవ‌స‌రాల‌కు అనుగుణంగా పార్టీలు మారుతూ., పార్టీల లైన్ దాటుతూ ఎన్నో సార్లు గంటా శ్రీ‌ను అనే విశాఖ ఉత్తర నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే , సీనియ‌ర్ మోస్ట్ లీడ‌ర్ వార్త‌ల్లో నిలిచి, గెలిచారు.

త‌న మాట నెగ్గించుకున్నారు. ఉత్త‌రాంధ్ర‌లో తిరుగులేని కాపు నేత. విశాఖ రాజ‌కీయంలో ఆరితేరిపోయిన నేత. కొంత బొత్స స‌త్తిబాబు ప్రోత్సాహం కూడా ఉంది. అదే ఆయ‌న‌కు ప్ల‌స్. ఈ నేప‌థ్యంలో ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ అన్న‌ది ఏంట‌న్న‌ది ఓ సారి చూద్దాం. విశ్లేషిద్దాం. గంటా శ్రీ‌నివాస‌రావు గ‌త కొద్దికాలంగా సైలెంట్ అయిపోయారు. ప‌రిణామాలేవీ ఆయ‌న‌కు అనుకూలంగా లేక‌పోవ‌డంతో గ‌తంలో మంత్రి ప‌ద‌విలో అనుభ‌వించిన హోదా ఇప్పుడు లేకుండా పోయింది. దీంతో ఆయ‌న అనుకున్న విధంగా ఎక్క‌డా మ‌న్న‌న కానీ గౌర‌వం కానీ ద‌క్క‌డంలేదు.

తీవ్ర నైరాశ్యంలో ఉన్న ఆయ‌న అనారోగ్య కార‌ణాల‌తో కొంత కాలం ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఆ త‌రువాత యాక్టివ్ అయ్యారు  కానీ పెళ్లిళ్ల‌కూ, పేరాంటాల‌కూ ప‌రిమితం అవుతున్నారే త‌ప్ప.. ఆ విధంగా హాజ‌ర‌యి ఫొటో సెష‌న్ లో పాల్గొని వెళ్తున్నారే త‌ప్ప నియోజ‌క‌వ‌ర్గంలో కానీ ఉత్త‌రాంధ్ర‌లో కానీ యాక్టివ్ కాలేక‌పోతున్నారు. మ‌రోవైపు ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం శిష్యుడు అవంతి శ్రీ‌ను వైసీపీలోకి వెళ్లి మంత్రి ప‌ద‌వి కొట్టేసి త‌రువాత చాలా వివాదాల్లో ఇరుక్కుపోయారు. అవంతి విద్యా  సంస్థ‌ల అధినేత గా పేరున్న ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావు (భీమిలి ఎమ్మెల్యే) వైసీపీలో కొన్ని ఆటుపోట్ల న‌డుమ బాగానే నిల‌దొక్కుకున్నారు.

ఇప్పుడీయ‌న విశాఖ జిల్లా వైసీపీ అధ్య‌క్షులు అయ్యారు. ఈయ‌న నిర్వ‌హించిన టూరిజం శాఖ కాస్త రోజాకు అప్ప‌గించారు. ఇప్ప‌టిదాకా క‌థ బాగానే ఉంది కానీ ఇప్పుడు అవంతిని త‌ప్పించి సీన్లోకి గంటా శ్రీ‌నును తీసుకువచ్చే ప్ర‌య‌త్నాలు కూడా జరుగుతున్నాయి అని తెలుస్తోంది. దాంతో గురువు రాక కోసం అవంతి శ్రీ‌ను నిరీక్షిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న మాత్రం సైలెంట్ కాక త‌ప్పదు. గంటా శ్రీ‌ను ఒక‌వేళ వైసీపీలో ఎంట్రీ ఇస్తే అందుకు బొత్స కూడా ఎంత‌గానో సంతోషిస్తారు. ఇంత‌కాలం సాయిరెడ్డి అనే రాజ్య‌స‌భ స‌భ్యుడు మ‌రియు విశాఖ వ్య‌వ‌హారాల ఇంఛార్జి ఆయ‌న‌ను అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు విశాఖ రీజన‌ల్ కో ఆర్డినేట‌ర్ ప‌దవి వైవీ సుబ్బారెడ్డి అనే టీటీడీ చైర్మ‌న్ కు ద‌క్కింది. దీంతో గంటా లైన్ క్లియ‌ర్ కానుంది. త్వ‌ర‌లో ఆయ‌న వైసీపీలో ఎంట్రీ ఇస్తే రాజ‌కీయాల్లో మ‌రోసారి మీడియాలో మ‌రో సారి హైలెట్ కావ‌డం త‌థ్యం.