పాద‌యాత్ర‌కు లోకేష్ రెడీ.. ఈ ప్లాన్ స‌క్సెస్ అయ్యేనా?

టీడీపీ యువ నాయ‌కుడు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. మాజీ మంత్రి నారా లోకేష్ త్వ‌ర‌లోనే పాద యాత్ర‌కు రెడీ అవుతున్నారు. మాజీ సీఎం చంద్ర‌బాబు ఈవిష‌యాన్ని చూచాయ‌గా చెప్పేశారు. పాద‌యాత్ర ద్వారా.. నారా లోకేష్‌ను గ్రామ గ్రామానా తిప్పాల‌ని.. భావిస్తున్న‌ట్టు.. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా సీనియ‌ర్ల‌కు ఆయ‌న క్లూ ఇచ్చారు. నిజానికి చంద్ర‌బాబు ఈ విష‌యంలో కొంత డోలాయ‌మానంలో ఉన్నారు. పాద‌యాత్ర త‌నే చేయాల‌ని.. గ్రామ గ్రామాన త‌నే తిర‌గాల‌ని ఆయ‌న అనుకున్నా.. వ‌యో సంబంధిత స‌మ‌స్య‌లతో విరమించుకున్నారు.

ఈనేప‌థ్యంలోనే లోకేష్‌ను పాదయాత్ర‌కు పంపించి.. తాను జిల్లాల యాత్ర చేప‌ట్టాల‌ని.. చంద్ర‌బాబు వ్యూహం సిద్ధం చేసుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. మే చివ‌రి వారంలో నిర్వ‌హించే మ‌హానాడు అనంత‌రం.. ఈ యాత్ర‌కు సంబంధించిన పూర్తి క్లారిటీ వ‌స్తుంద‌ని.. పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. వచ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు జిల్లాల్లో ప‌ర్య‌టించాల‌ని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయ‌న ఇప్ప‌టికే శ్రీకారం చుట్టాల‌ని అనుకున్నా.. మ‌హానాడు అనంత‌రం.. దీనిపై అన్ని వ‌ర్గాల‌ను స‌మాయ‌త్త ప‌రిచి నిర్ణ‌యం తీసుకోనున్నారు.

ఒకసారి జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌ను ప్రారంభించిన త‌ర్వాత‌.. ఎట్టి ప‌రిస్థితిలోనూ బ్రేక్ ఇవ్వ‌రాద‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో గ్రామాల ప‌రిధిలో.. నారా లోకేష్‌తో పాద‌యాత్ర చేయించ‌నున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నారని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌తి గ్రామాన్నీ సంద‌ర్శించేలా లోకేష్ పాద‌యాత్ర రూట్ మ్యాప్ రెడీ అవుతోంది. ఇలా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు లోకేష్ గ్రామ‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఫలితంగా పార్టీని మ‌ళ్లీ  అధికారంలోకి తీసుకురావాల‌ని చంద్ర‌బాబు  నిర్ణ‌యించుకున్నారు. గ్రామీణ స్థాయిలో టీడీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో పాద‌యాత్ర చేసిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఈ ఓటు బ్యాంకును బాగా దెబ్బ‌తీశార‌ని.. టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో దెబ్బ‌కు దెబ్బ అన్న‌ట్టుగా.. అదే గ్రామాల్లో.. పాద‌యాత్ర ను చేయ‌డం ద్వారా.. తిరిగి టీడీపీ ఓటు బ్యాంకును ద‌క్కించుకునేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలోనే లోకేష్‌ను గ్రామీణ స్థాయిలో పాద‌యాత్ర చేయించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి కూడా త్వ‌ర‌లోనే ముహూర్తం ఖ‌రారు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది.  ఈ ప‌రిణామాలు పార్టీలోనూ మంచి ఊపు తెస్తాయ‌ని.. చంద్ర‌బాబు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఒక్క ఏడాది పాటు.. స‌మ‌యం ఉన్నందున‌.. పాద‌యాత్ర చేయ‌డ‌మే బెట‌ర్ అని నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న రేపో మాపో చేసే అవ‌కాశం ఉంది.