ఒంగోలులో ఓ కుటుంబం నుంచి ఆర్టీఏ అధికారులు కారు స్వాధీనం చేసుకున్న ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. భార్య, పిల్లలతో తిరుమల వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎక్కడిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రజల కారు లాక్కెళ్తారా అని మండిపడ్డారు. కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలే ని స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లిందని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడితే.. ప్రజలకు ఏం సమాధానం చెబుతారని దుయ్యబట్టారు. సీఎం వస్తే దుకాణాలు మూసేయడం లాంటివే కాకుండా కాన్వాయ్ కోసం కార్లను సైతం లాక్కెళ్తారా అని మండిపడ్డారు.
ఏం జరిగిందంటే..
తిరుపతికి వెళ్లే ప్రయాణికుల కారును ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ఆర్టీఏ అధికారులు.. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన ఒంగోలులో జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆకలిగా ఉండటంతో బుధవారం రాత్రి సమయంలో ఒంగోలులోని స్థానిక పాత మార్కెట్ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్ చేస్తుండగా ఓ కానిస్టేబుల్ అక్కడికి వచ్చారు. ఈ నెల 22న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలు పర్యటన నేపథ్యంలో.. కాన్వాయ్ కోసం వాహనంతో పాటు డ్రైవర్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము కుటుంబంతో తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు.
ఉన్నతాధికారుల ఆదేశాలు సార్.. మీకు సారీ చెప్పడం తప్ప మేమేమీ చేయలేమంటూ కారుతో పాటు డ్రైవర్‌ను తీసుకుని ఆ కానిస్టేబుల్ వెళ్లిపోయాడు. సీఎం కాన్వాయ్‌కు వాహనాలు కావాలంటే స్థానికులను అడిగి తీసుకోవాలనీ, దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న వారి నుంచి, అందునా మొక్కులు తీర్చుకునేందుకు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న వారి వాహనాలు లాక్కుని రోడ్డుపాలు చేయడం ఏమిటని వాపోయారు. ఊరుకాని ఊళ్లో తమకు ఇప్పటికిప్పుడు తిరుమల వెళ్లేందుకు వాహనం ఎక్కడ దొరుకుతుం దని ఆవేదన వ్యక్తం చేశారు. స్వస్థలానికి వెళ్లేందుకు కూడా వాహనం దొరికే పరిస్థితి లేదని ఆవేదన చెందారు.
సీఎం జగన్ సీరియస్..
ఒంగోలులో సీఎం కాన్వాయ్ కోసం ప్రయాణికుల నుంచి కారు స్వాధీనం చేసుకున్న ఘటనపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికి కారణమైన హోంగార్డు పి.తిరుపతి రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎ. సంధ్యను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ.. సీఎం జగన్‌పై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.