ఏపీ సీఎం జగన్.. ఇటీవల ఒక వ్యాఖ్య చేశారు. “మనం.. టీడీపీని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఆ పార్టీకి అనుకూలం గా ఉన్న మీడియాతోనే మనం పోరాడాల్సింది“ అని! ఈ మాట అని పట్టుమని రెండు వారాలు కూడా గడవకుండా.. దీనికి మించిన సమస్య జగన్‌కు ఎదురైందని.. సొంత పార్టీలో సీనియర్ నేతలే గుసగుసలాడుతున్నారు. ప్రత్యర్థి పార్టీ టీడీపీ కన్నా.. జగన్ `ఇదే` పెనుసవాలుగా మారిందని చెబుతున్నారు. దీనిని ఎదుర్కోవడం.. చాలా కష్టమని అంటున్నారు. ఇది పైకి కనిపించే శతృవు కాదని కూడా తీర్మానం చేస్తున్నారు. అదే.. అసంతృప్తుల అధికార కాంక్ష!!
ఇటీవల జరిగిన జగన్ 2.0 కేబినెట్లో ఆశించిన వారికి మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఆశించని వారికి పదవులు లభించాయి. అసలు వీరికి మళ్లీ ఛాన్సివ్వరు.. అనుకున్నవారికి మరోసారి అవకాశం ఇచ్చారు. అదేసమయంలో తమకు ఖచ్చితంగా బెర్త్ ఖాయం అనుకున్నవారికి మొండి చేయి చూపించారు. ఇలాంటా వారు 50 నుంచి 80 మంది కీలక నాయకులు.. జిల్లాలను ప్రభావితం చేయగల ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు. వీరే గత ఎన్నికల్లో అన్ని విధాలా(ఆర్థికంగా.. అనుచరుల పరంగా) పార్టీకి కష్టపడ్డారు. అదికారంలోకి వచ్చాక.. ఏదైనా తమకు లబ్ధి చేకూరుతుందని అనుకున్నారు. అయితే.. గత కేబినెట్‌లోనూ ఇప్పుడు కూడా వీరికి అవకాశం లభించలేదు.
పోనీ.. ఇప్పుడు మంత్రి పదవులు దక్కించుకున్నవారిలో సగం మంది.. సొంతగా పార్టీని బలోపేతం చేసిన వారు ఉన్నారా? అంటే.. లేరు. వీరు స్వతంత్రంగా గెలవలేరని.. సీనియర్లే చెబుతున్నారు. వీరి గెలుపు కోసం.. కీలక నేతలు ప్రయత్నాలు చేయాలని అంటున్నారు. ఇలాంటి వారికి పదవులు ఇచ్చి వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ సీఎం పీఠం దక్కించుకుంటారా? అనేది సీనియర్ల కీలక ప్రశ్న. మంత్రి పదవులు దక్కనివారు. అంతు చూస్తామని.. హెచ్చరిస్తున్నారు. పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు.. ఇదే వ్యాఖ్యలు చేశారు. విధ్వంస కర రాజకీయాలు చేస్తానని. అన్నారు. ఆయన అలా చేసిన వ్యాఖ్యలు ఎస్సీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
ఇక, రెడ్డి సామాజిక వర్గంలోనూ.. కీలక నేతలు రగిలిపోతున్నారు. పైకి.. ఆల్ ఈజ్ వెల్ అని అంటున్నా.. మొహంలో ఎక్కడా కళ కనిపించడం లేదు. ఆవేదన మాత్రమే కనిపిస్తోంది. ఈ జాబితాలో కడపకే చెందిన బూచేపల్లి శివప్రసాదరెడ్డి, నెల్లూరు కు చెందిన ప్రసన్న కుమార్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి సోదర త్రయం.. వంటి కీలక దిగ్గజ నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో.. ఈ అసంతృప్తులు.. జగన్‌ను కాదనుకుంటే.. ఏం చేయాలి? ఏం జరుగుతుంది? అనేది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
కొందరైతే.. రాజకీయాలపై విరక్తికలిగిందంటూ.. రాజీనామాలకు కూడా సిద్ధమయ్యారు. అయితే.. చివరి నిముషంలో ఆగినా.. వారిలో మాత్రం సదరు అసంతృప్తి ఛాయలు మాత్రం సమసిపోలేదు. పోనీ.. జగనే నమ్ముకున్న వారిలో ఎంత మంది పార్టీని తిరిగి పట్టాలెక్కిస్తారు. .? . అనేది కూడా కీలకంగా మారింది. ఎందుకంటే.. జగన్ మంచి నాయకుడే కావొచ్చు.. పథకాలు అమలు చేయనూ వచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో నాయకుడిని చూసే.. ప్రజలు ఓటేస్తారు. 2019 ఎన్నికల ఫలితమే రిపీట్ కావలంటే.. సాధ్యం కాదు. సో.. ఇప్పుడు మారిన మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. జగన్ మారకపోతే.. సీనియర్లను, దిగ్గజ నేతలను దగ్గరకు చేర్చుకోకపోతే.. కనిపించని శత్రువుల్లా.. వీరు పార్టీకి గుదిబండలు కావడం గమనార్హం అంటున్నారు సీనియర్లు.