నాలుగు చోట్లా బీజేపీకి నిరాశేనా ?

తాజాగా వెల్లడైన పార్లమెంట్, అసెంబ్లీల ఉపఎన్నికలన్నింటిలోను బీజేపీకి నిరాశే ఎదురైంది. మొత్తం అన్నీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే విజయం సాధించాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమంటే పశ్చిమ బెంగాల్లోని అసన్ సోల్ లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి శత్రుజ్ఞ సిన్హా గెలవటం. బాబూల్ సుప్రియో బీజేపీ ఎంపీగా రాజీనామా చేసి తృణమూల్ లో చేరారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

సుప్రియో కు బదులుగా పోటీ చేసిన సిన్హాను ఎలాగైనా ఓడించాలని బీజేపీ చాలా ప్రయత్నాలే చేసింది. కానీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముందు బీజేపీ నిలవలేకపోయింది. పైగా గతంలో ఈ సీటులో బీజేపీ అభ్యర్థిగా ఉన్నపుడు సుప్రియోకు 1.97 లక్షల మెజారిటీ వస్తే ఇపుడు సిన్హాకు 3 లక్షల మెజారిటీ రావటం గమనార్హం. అంటే బీజేపీ ఖాతాలో నుండి ఒక లోక్ సభ స్థానం జారిపోయినట్లు అర్ధమవుతోంది. ఇదే సమయంలో బెంగాల్లో మమత హవా ఇంకా ఏమాత్రం తగ్గలేదని కూడా తెలుస్తోంది.

ఇదే సమయంలో బెంగాల్లోని బాలీగంజ్ అసెంబ్లీకి కూడా ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో పోటీచేసిన బాబూల్ సుప్రియో సీపీఎం అభ్యర్థి సైరా షా హలీంపై 20 వేల ఓట్లకు పైగా మెజారిటితో గెలిచారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే బీజేపీ అభ్యర్థి మూడోస్థానంలో ఉండిపోయారు. ఇక మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో అధికార కూటమి మహా వికాస్ ఘడీ తరపున పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచారు. ఛత్తీస్ గడ్ లో కూడా అధికార కాంగ్రెస్ అభ్యర్ధి యశోదా వర్మ బీజేపీ అభ్యర్థిపై గెలిచారు.

బీహార్లోని బోచహాన్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార కూటమి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్ధి ని ఓడించటమే ఆశ్చర్యంగా ఉంది. ఆర్జేడీ అభ్యర్ధి అమర్ పాసవాన్ 35 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ బీజేపీ అధికార కూటమిలో ఉన్నప్పటికీ ఓడిపోవటం గమనార్హం. అంటే హోలు మొత్తంమీద బీజేపీ ఎక్కడా గెలవలేదన్నది స్పష్టమైపోతోంది. రెండు ఉప ఎన్నికల్లో గెలవటం కాంగ్రెస్ కు కాస్త ఉత్సాహాన్నిచ్చేదే అనటంలో సందేహంలేదు.