రాష్ట్రంలో పరిస్థితులు రానురాను విచిత్రంగా తయారవుతోంది. ముఖ్యమంత్రి ఎక్కడ పర్యటించినా ముందుగా గృహ నిర్బంధాలు ఎదురవుతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా ఇలాంటి పరిస్ధితే ఎదురయ్యింది. మామూలుగా అయితే ప్రతి పక్షాల నేతలను నిర్బంధించటం జరుగుతున్నదే.
అయితే మామూలు జనాలను నిర్బంధించటం మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఎవరున్నా మామూలు జనాలజోలికి వెళ్ళరు. ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తున్నారంటే మామూలు జనాలు రావటం కలిసి విజ్ఞాపనలు చేసుకోవటం చాలా సహజం. కాబట్టి పోలీసులు మామూలు జనాలను నిర్బంధించటం చాలా చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఇపుడు జగన్ పర్యటించిన ప్రాంతంలో కొన్ని ఇళ్ళకు పోలీసులు తాళాలు వేయటం ఆశ్చర్యంగా ఉంది.
సీఎం పర్యటించిన ప్రాంతంలో ముందు జాగ్రత్తగా ఇళ్ళపైన పోలీసులు కాపలా ఉండటం సర్వసాధారణమే. కానీ జనాలను బయటకు రానీయకుండా తలుపులకు తాళాలు వేయటం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది. ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలంటే ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి గొడవలు చేస్తారని అనుకోవచ్చు. మామూలు జనాలు అలాంటివేమీ చేయరు. మహా అయితే తమ ప్రాంతాల్లోని సమస్యలను చెప్పుకుంటారు, పథకాలు అందటం లేదని చెప్పుకుంటారు.
ముఖ్యమంత్రి జనాల మధ్యలోకి వచ్చినపుడు కూడా ఎవరినీ కలవనీయకుండా ఇళ్ళల్లోనే ఉంచి బయట తాళాలు వేయటం అంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈ విషయం డైరెక్టుగా జగన్ కు తెలియకపోవచ్చు. కానీ కింద స్ధాయి అధికారులు కావచ్చు లేదా నేతల నిర్ణయం వల్ల జరిగిన దానికి సమాధానం మాత్రం జగనే చెప్పుకోవాలి. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న విషయాన్ని జగన్ గ్రహించాలి. పాదయాత్రలో లక్షలాది మంది జనాలను కలిసిన జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు దూరంగా ఉంటారు ? ఇది కచ్చితంగా జిల్లా స్థాయి లేదా సదరు ఎంఎల్ఏ నుండి వచ్చిన ఆదేశాలే అయ్యుండాలి. ఏదేమైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం జగన్ పైనే ఉంది.