ధాన్యం కొనుగోలులో రెంటికీ చెడ్డ టీఆర్ఎస్‌…!

యాసంగి ధాన్యాన్ని కేంద్ర‌మే కొనాల‌ని ఇన్నాళ్లూ బెట్టు చేసిన కేసీఆర్ ఒక అడుగు వెన‌క్కి వేయ‌డంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ ప‌డిన‌ట్లైంది. రైతులు ఎవ‌రూ ఆందోళన చెందొద్ద‌ని.. ప్ర‌తి గింజా కొంటామ‌ని.. ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మూడు నాలుగు రోజుల్లో ధాన్యాన్ని సేక‌రిస్తామ‌ని సీఎం కేసీఆర్ నిన్న‌టి కేబినెట్ స‌మావేశంలో తెలిపారు. దీంతో ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి ఐదారు నెల‌లుగా కొనసాగుతున్న ర‌చ్చ‌ ప్ర‌స్తుతానికి ముగిసిన‌ట్లే. అయితే ఈ అంశంపై రాజ‌కీయ మైలేజీ ఎవ‌రికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది.

తొలుత ధాన్యం సేక‌ర‌ణ‌కు సంబంధించి టీఆర్ఎస్ ఊరూరా ధ‌ర్నాలు చేసింది. కేంద్ర‌మే ధాన్యం కొనాల‌ని పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వ‌హించింది. తెలంగాణ అంత‌టా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసింది. ఆ త‌ర్వాత పార్ల‌మెంటులో ఆందోళ‌న చేసింది. ఇటీవ‌ల ఢిల్లీలో చేప‌ట్టిన ధ‌ర్నాలో ఏకంగా సీఎం కేసీఆర్ పాల్గొని కేంద్రంపై ధ్వ‌జ‌మెత్తారు. 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు. అయినా కేంద్రం స్పందించ‌లేదు. దీంతో చేసేదేమీ లేక రాష్ట్ర‌మే ధాన్యం కొనాల‌ని నిర్ణ‌యించుకుంది. లేదంటే రాజ‌కీయంగా న‌ష్ట‌పోతామ‌ని భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

అయినా.. ఈ విష‌యంలో టీఆర్ఎస్ కు వ‌చ్చే రాజ‌కీయ మైలేజీ త‌క్కువేన‌ని తెలుస్తోంది. బీజేపీని దోషిగా చూపి లాభ‌ప‌డ‌దామ‌నుకొంది. కానీ క్షేత్ర స్థాయిలో ఆ ప‌రిస్థితులు లేవ‌ని అర్థ‌మైంది. ఎందుకంటే మొద‌ట యాసంగిలో వ‌రి ధాన్యం వేయ‌వ‌ద్ద‌ని.. ఇత‌ర ప్ర‌త్యామ్నాయ పంట‌లు వేసుకోవాల‌ని రాష్ట్రం సూచించింది. ఏకంగా క‌లెక్ట‌ర్ల‌తోనే ప్ర‌క‌ట‌న‌లు ఇప్పించింది. ఎరువుల డీల‌ర్ల‌ను విత్త‌నాలు అమ్మ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించింది.

దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వంపై క‌ర్ష‌కులు కోపం పెంచుకున్నారు. చాలా మంది రైతులు వ‌రి సాగు చేయ‌కుండా వేలాది ఎక‌రాల్ని ప‌డావు పెట్టారు. ఆయ‌క‌ట్టు ప్రాంత రైతులు, ఇత‌ర పంట‌ల సాగుకు వీలుకాని చోట్ల మాత్రం వ‌రిని పండించారు. ఇపుడు ధాన్యాన్ని రాష్ట్ర‌మే కొంటామ‌ని చెబుతుండ‌డంతో సాగు చేయ‌ని రైతులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పండించిన రైతులకు కూడా ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై న‌మ్మ‌కం లేకుండా పోయింది. దీంతో టీఆర్ఎస్ ప‌రిస్థితి రెంటికీ చెడ్డ రేవ‌డిలా మారిన‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి త‌న వంతు ఏమీ చేయ‌కుండా ప్రేక్ష‌క పాత్ర వ‌హించిన బీజేపీకి కూడా ఈ విష‌యంలో పెద్ద‌గా గిట్టుబాటు అయిన‌ట్లు లేదు. రాష్ట్రం సానుకూల నిర్ణ‌యానికే తామే కార‌ణ‌మ‌ని బీజేపీ సంబ‌రాలు చేసుకుంటున్నా.. ఈ రెండు పార్టీలు క‌లిసి త‌మ‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయ‌ని రైతులు భావిస్తున్నారు. ఇక ధాన్యం సేక‌ర‌ణ ఎపిసోడ్ మొత్తం టీఆర్ఎస్‌, బీజేపీ క‌లిసి ఆడుతున్న నాట‌కంగా మొద‌టి నుంచీ కార్న‌ర్ చేస్తున్న‌ కాంగ్రెస్ ఈ విష‌యంలో కొంత విజ‌యం సాధించిన‌ట్లుగా చెప్ప‌కోవ‌చ్చు.

కేసీఆర్ ఫాంహౌస్‌లో పండించిన ధాన్యాన్ని ఎవ‌రు కొంటారో.. వారే రైతుల ధాన్యాన్ని కొనాల‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ మొద‌టి నుంచీ ఎత్తి చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన కార్యాచ‌ర‌ణ సూటిగా రైతుల్లోకి వెళ్లిపోయింది. ఈ అంశంపైనే త్వ‌ర‌లో రాహుల్ గాంధీతో బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేయాల‌నుకున్నారు. ఇపుడు రాష్ట్రం యూట‌ర్న్ తీసుకోవ‌డంతో ఇది త‌మ గెలుపుగానే కాంగ్రెస్ భావిస్తోంది.