సీఎం జగన్ కొత్త కెబినేట్ 2.0పై టీడీపీ నేత, మాజీ మంత్రి, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే(రాజీనామా చేసినప్పటికీ.. ఇంకా ఆమోదం పొందలేదు) గంటా శ్రీనివాసరావు స్పందించారు. వైసీపీ వర్గీయులే నిరసనలకు దిగేలా జగన్ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరిగిందని విమర్శంచారు. మంత్రివర్గ విస్తరణలో ప్రాంతాలకు న్యాయమైన హేతుబద్ధత కొరవడిందన్నారు. “ఇదేం మంత్రి వర్గం.. ఇదే కేబినెట్. ఇదంతా భజన పరుల క్యాబినెట్. ఇదా సామాజిక సమతుల్యం. ఇది మోసం చేయడమే. కేబినెట్ హడావుడితో విలువైన వారంరోజుల సమయాన్ని సుమారు కోటి రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారు” అని గంటా వ్యాఖ్యానించారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ప్రాంతాలకు న్యాయమైన హేతుబద్ధత లేదని గంటా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ పార్టీలో ఉన్న కీలక నేతలు, పార్టీ అనుచరులు, మాజీ మంత్రుల వర్గీయులే నిరసనలకు దిగేలా జగన్ మంత్రివర్గ విస్తరణ జరిగిందని విమర్శంచారు. విశాఖను రాజధాని అని చెప్తున్న ప్రభుత్వం.. నగరానికి కనీసం మంత్రిని లేకుండా చేశారని దుయ్యబట్టారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటోందని.. కానీ వారికి మేలు చేసింది మాత్రం తెలుగుదేశం పార్టీనే అని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
జిల్లా విభజన కూడా సరిగా జరగలేదన్నారు. జిల్లా విభజన సమయంలో సీఎం తీరుతో సొంతపార్టీ నాయకులే చెప్పులతో కొట్టుకున్నారని గుర్తు చేశారు. కొత్త కెబినేట్ ఏర్పాటుతో వైసీపీలోను విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు జగన్ తనని తాను బలమైన నాయకుడిగా చూపించుకున్నారని.. కానీ తాజా పరిస్థితులతో బలహీనమైన నాయకుడని నిరూపణ అయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. ప్రజలు కూడా ఆయన పాలనతో విసిగిపోయారని చెప్పారు.
“ధరలు పెంచనని ఆయనే చెప్పారు. ఇప్పుడు ధరలు పెంచారు. అమరావతిని రాజధానిగా కావాలని.. ఆయనే అన్నారు. 33 వేల ఎకరాల భూమి కావాలన్నారు. ఇప్పుడు అదే రాజధానిని ముంచేస్తున్నారు. ప్రజలను దేవుళ్లలా చూస్తానని చెప్పారు. రైతులకు రాజన్య రాజ్యం చేరువ చేస్తానని అన్నారు.కానీ, ఇవేవీ.. సాకారం కావడం లేదు. నియంత మాదిరిగా పాలిస్తున్నారు. ఇలాంటి.. పాలన కోసమేనా. ఒక్క ఛాన్స్ అని రోడ్లు పట్టుకు తిరిగారు?” అని గంటా ప్రశ్నించారు. మరి దీనిపై విశాఖ వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ముఖ్యంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎలాంటి కామెంట్లు చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates