ఇటు ఫిర్యాదు అటు ప‌ద‌వి.. టీ కాంగ్రెస్ తీరే వేర‌యా..!

తెలంగాణ కాంరెస్ ప‌ట్ల అధిష్ఠానం వ్య‌వ‌హార శైలి వింత‌గా ఉంది. ఎవ‌రికి ఎప్పుడు ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతుందో.. ఎవ‌రిని ఎందుకు అంద‌లం ఎక్కిస్తుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. పార్టీ నేత‌ల‌కు ఒక్కోసారి నెల‌ల త‌ర‌బ‌డి వేచి చూసినా అధిష్ఠానం అపాయింట్మెంట్ ఇవ్వ‌దు. ఇంకొన్ని సార్లు వారు అడ‌గ‌క‌పోయినా అపాయింట్మెంట్ ల‌భిస్తుంది. కొంద‌రిని రాహుల్ క‌లిస్తే మ‌రికొంద‌రు సోనియాతో భేటీ అవుతారు. అధిష్ఠానం వైఖ‌రిని పార్టీలో కొంద‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా రేవంత్ వ‌ర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అధిష్ఠానం వైఖ‌రే పార్టీలో ప‌రోక్షంగా గ్రూపు రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించేలా ఉంద‌ని రేవంత్ వ‌ర్గం అస‌హ‌నంగా ఉంది. రేవంత్ నియామ‌కాన్ని మొద‌టి నుంచీ వ్య‌తిరేకిస్తున్న కోమ‌టిరెడ్డికి స్టార్ క్యాంపెయిన‌ర్ ప‌ద‌వి ఇవ్వ‌డ‌మే ఇందుకు కార‌ణంగా తెలుస్తోంది. రేవంత్ నియామ‌కాన్ని బ‌హిరంగంగా త‌ప్పు ప‌ట్టి, ఓటుకు నోటు కేసులా ప‌ద‌విని కొనుక్కున్నాడ‌ని ఆరోపించిన కోమ‌టిరెడ్డికి ప‌ద‌వి కేటాయించ‌డాన్ని రేవంత్ వ‌ర్గం ఆక్షేపిస్తోంది. పైగా రేవంతుకు పొగ పెడుతున్న సీనియ‌ర్లు వీహెచ్‌, జ‌గ్గారెడ్డి, స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ వంటి వారికి రాహుల్‌, సోనియా ఎలా అపాయింట్మెంట్లు ఇస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఒక‌వైపు పార్టీ అధ్య‌క్షుడిగా రేవంత్ చ‌ర్య‌ల‌ను ప్ర‌శంసించిన అధిష్ఠానం.. మ‌రోవైపు పార్టీ స‌భ్య‌త్వాలు, కార్య‌క్ర‌మాల‌ను కూడా ప‌ట్టించుకోని వారికి మ‌ద్ద‌తు ప‌లికింది. రేవంతుకు స‌హ‌క‌రించాల‌ని సీనియ‌ర్ల‌కు చెబుతూనే ఆయ‌న‌కు అడ్డంకులు క‌లిగించే విధంగా చ‌ర్య‌లు ఉన్నాయ‌ని పార్టీలో ఒక వ‌ర్గం భావిస్తోంది. రేవంత్ దూకుడుగా వెళ్ల‌కుండా పీఏసీ స‌మావేశంలోనే భ‌విష్య‌త్ కార్య‌క్ర‌మాలు నిర్ణ‌యించాల‌ని సూచించింది. తాజాగా టికెట్ల అంశం కూడా రేవంత్ కు వ‌దిలేయ‌కుండా అధిష్ఠాన‌మే త‌న చేతుల్లోకి తీసుకుంది.

ఈ ప‌రిణామాలు రేవంత్ వ‌ర్గానికి మింగుడుప‌డ‌డం లేదు. ఇక త‌మ నేత‌కు అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చి ఉప‌యోగం ఏముంద‌నే విధంగా ప్ర‌శ్నిస్తున్నారు. రేవంతుకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వ‌కుంటే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాలేద‌ని.. గ్రూపు రాజ‌కీయాల‌తోనే కాలం వెళ్ల‌దీయాల్సి వ‌స్తుంద‌ని మ‌ధ‌న‌ప‌డుతున్నారు. తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘ‌ట‌నను ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు.

పీసీసీ అధికార ప్ర‌తినిధి, తుంగ‌తుర్తి నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి ద‌యాక‌ర్ కు వ్య‌తిరేకంగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో గ్రూపు రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. త‌ను రెండు సార్లు ఓడిపోవ‌డానికి కార‌ణ‌మైన పార్టీ బ‌హిష్కృత నేత వ‌డ్డేప‌ల్లి ర‌విని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు ఉత్త‌మ్‌, కోమ‌టిరెడ్డి, దామోద‌ర్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ద‌యాక‌ర్ ఆరోపిస్తున్నారు. ఆ ముగ్గురిపై ఫిర్యాదు చేస్తూ రాహుల్ కు లేఖ రాశారు. అటు లేఖ లీక్ అయిన రోజే కోమ‌టిరెడ్డికి పార్టీ ప‌ద‌వి ఇచ్చింది. దీంతో రేవంత్ వ‌ర్గం అవాక్క‌యింది. అద్దంకి ద‌యాక‌ర్ రేవంత్ వ‌ర్గానికి చెందిన నేత కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో అధిష్ఠాన‌మే ప‌రోక్షంగా గ్రూపు రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తుంద‌నే భావ‌న‌లో ఉన్నారు. చూడాలి మ‌రి రేవంత్ వ‌ర్గం ఎలా ముందుకు వెళుతుందో..!