జ‌గ‌న్ ను ఆరాధించండి అన్ని ప‌నులు అవుతాయి మంత్రిగారి భ‌జ‌న‌

జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో చోటు ద‌క్కించుకున్న మంత్రులు త‌లకో ర‌కంగా స్పందిస్తున్నారు. మంత్రి వ‌ర్గ ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలోనే స్వామి భ‌క్తిని, భ‌జ‌న‌ను ప్ర‌ద‌ర్శించిన నాయ‌కులు.. మంత్రులుగా బాధ్య‌త‌లు తీసుకున్నాక‌.. త‌మ విశ్వ‌రూపం చూపిస్తున్నారు. తాము చేస్తున్న భ‌జ‌న చాల‌ద‌న్న‌ట్టుగా.. మీడియాను కూడా భ‌జ‌న చేయాల‌ని.. ప్రోత్స‌హిస్తున్నారు. అంతేకాదు.. జ‌గ‌న్ గురించి.. ఆయ‌న లోపాల గురించి కూడా ఆరా తీయొద్ద‌ని సూటిగా చెబుతున్నారు. అంతేనా.. ఇలా చేస్తే.. మీకు ప‌నులు కావంటూ స్ప‌ష్టం చేస్తున్నారు. ఇలా అన్న‌ది ఎవ‌రో తెలుసా.. సాక్షాత్తూ.. స‌మాచార మంత్రి.

బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రిగా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తాజాగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజల అనంతరం చెల్లుబోయిన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చీఫ్‌ విప్‌ ముదనూరి ప్రసాదరాజు, ఐ అండ్‌ పీఆర్‌ శాఖాధికారులు మంత్రికి అభినందనలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని కొన్ని చానెళ్లు లైవ్‌కూడా ఇచ్చాయి.

ఈ సంద‌ర్భంగా మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ.. “మీడియా మిత్రుల‌కు నా మ‌నవి ఏంటంటే.. సీఎం జ‌గ‌న్ గారి గురించి లోపాలు వెత‌కం మానేయండి. ఆయ‌న‌ను ఆరాధించండి. ఆయ‌న‌ను ఆరాతీయ‌డం..ఆయ‌న ఏం చేస్తున్నారో.. తెలుసుకోవ‌డం వ‌ల్ల మీకు వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏమీ లేదు. మీరు ఆరాధించ‌డం ప్రారంభిస్తే.. మీకు అన్నీ మంచే జ‌రుగుతాయి. మీరు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న ఇళ్లు సాకారం కావాలంటే.. ఆరా తీయ‌డం మానేసి ఆరాధించండి. వెంట‌నే జ‌రిగిపోతాయో లేదో చూడండి” అని వ్యాఖ్యానించారు. అంటే.. త‌ను చేస్తున్న భ‌జ‌న చాల‌ద‌ని.. మీడియా కూడా భ‌జ‌న చేయాల‌ని మంత్రిగారు సెల‌విస్తున్నార‌న్న‌మాట‌.. అని మీడియా ప్ర‌తినిధులు గుస‌గుస‌లాడ‌డం గ‌మ‌నార్హం.

కాగా, చెల్లుబోయిన రాజకీయం చూస్తే.. 2001లో రాజోలు జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2006లో తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2008–12లో తూర్పుగోదావరి డీసీసీ అధ్యక్షుడిగా, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 2013లో వైఎస్సార్‌సీపీ కాకినాడ రూరల్‌ కో ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలుపొందారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో 2020 జూలై 24న మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో రెండోసారి అవకాశం దక్కించుకున్నారు. మొత్తానికి ఆయ‌న భ‌జ‌న బాగా క‌లిసి వ‌చ్చింద‌న్న‌మాట‌.. అనే కామెంట్లువిని పిస్తున్నాయి.