జ‌గ‌న్ కొత్త కేబినెట్లో వీళ్ల‌దే ఫుల్ డామినేష‌నా…?

Jagan
AP CM YS Jagan Pressmeet

కొత్తమంత్రివర్గంలో బలహీనవర్గాలకు ప్రత్యేకించి బీసీ సామాజికవర్గానికి పెద్ద పీటవేయాలని జగన్మోహన్ రెడ్డి దాదాపు డిసైడ్ అయ్యారు. రాజీనామాలు చేసిన మంత్రుల్లో బలహీనవర్గాలకు చెందిన వారి శాతం 56 ఉండేది. అంటే అగ్రవర్ణాల వారి శాతం 44 కి జగన్ పరిమితం చేసేశారు. అయితే కొత్తగా కొలువుతీరబోయే మంత్రివర్గంలో అగ్రవర్ణాల శాతాన్ని మరింత కుదించేయబోతున్నట్లు తెలుస్తోంది.

కొత్త మంత్రివర్గంలో బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటిల వాటాను సుమారు 60 శాతానికి తీసుకెళ్ళాలని జగన్ డిసైడ్ చేశారట. జగన్ తాజా నిర్ణయంలో రెండు పాయింట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. మొదటిదేమిటంటే బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఆ సామాజికవర్గాలను వీలైనంతగా ఆకర్షించటం. ఇక అగ్రవర్ణాలు అంటే సొంత సామాజికవర్గంతో పాటు కాపుల వాటాను వీలైనంత తగ్గించటం.

ఇక్కడ గమనించాల్సిందేమంటే టీడీపీకి మొదటినుండి మద్దతుగా నిలుస్తున్న బీసీలను వీలైనంతగా ఆకట్టుకోవాలనే టార్గెట్ తో జగన్ పావులు కదుపుతున్నారు. అందుకనే ప్రతిపక్షంలో ఉన్నపటినుండి బీసీలకు ప్రాధాన్యతిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎంపీ టికెట్లలో రాయలసీమలో అత్యధికం బీసీలకే కేటాయించి మంచి ఫలితాన్ని కూడా పొందరు. రేపటి ఎన్నికల్లో కూడా ఇదే విధంగా లాభపడాలన్నదే జగన్ ఆలోచన. అందుకనే గతంలో ఎప్పుడు లేనంతగా మంత్రివర్గంలో బీసీల వాటా బాగా పెరగబోతోంది.

జగన్ ప్లాన్ సక్సెస్ అయితే టీడీపీ మీద పెద్ద దెబ్బ పడటం ఖాయమనే చెప్పాలి. మొన్నటి స్ధానికసంస్ధల ఎన్నికల్లోనే ఈ విషయం రుజువైంది. రేపటి సాధారణ ఎన్నికల్లో కూడా ఇదే రిపీటైతే టీడీపీ పనిగోవిందానే. కొత్త క్యాబినెట్ నూరుశాతం ఎన్నికల క్యాబినెట్ అనటంటలో సందేహంలేదు. ఏ రాజకీయ నేత ఏమి చేసినా ఓట్లరూపంలో లబ్దిపొందేందుకే కదా. జగన్ కూడా ఇదే పద్దతిలో ఆలోచించి పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించటమే ఏకైక ధ్యేయంగా పెట్టుకున్న జగన్ అందుకు తగ్గట్లే ప్లాన్ చేస్తున్నారు. మరి జగన్ ప్లాన్లు వర్కవుటవుతాయా ? అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.