వైసీపీ హ‌యాంలో ఇలా కూడా చేస్తారా?

ఏపీలో వైసీపీ పాల‌న ప్రారంభించిన త‌ర్వాత‌.. దేవాల‌యాల‌పై దాడులు పెరిగిపోయాయ‌ని.. విగ్ర‌హాల‌ను ధ్వంసం చేయ‌డం.. ఆల‌యాల కూల్చివేత‌లు స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయాయ‌ని.. రాష్ట్ర బీజేపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌తీర్థంలో ఏకంగా.. రాముడి శిర‌చ్ఛేద‌న రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని సైతం ఉలిక్కి ప‌డేలా చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నిందుతులు ఎవ‌రో.. ప‌ట్టుకోలేక పోవ‌డం.. ఏపీ స‌ర్కారుకే చెల్లింద‌నే విమ‌ర్శ‌లు సామాన్యుల నుంచి కూడా వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు.. రాష్ట్రంలో బ‌ల‌వంత‌పు.. సానుకూల మ‌త‌మార్పిడులు జ‌రుగుతున్నాయ‌ని.. రాష్ట్ర బీజేపీ నేత‌లు నెత్తీనోరూ.. మొత్తుకుంటున్నారు. దీనిపై ఇటీవ‌ల‌కేంద్రం కూడా క‌న్నెర్ర చేసి.. రాష్ట్ర అధికారుల‌కు తాఖీదులు పంపించింది. ఇదిలావుంటే.. ఆలయాల‌పై దాడుల‌ను మించిన ఘోరం చోటు చేసుకుంది. అది కూడా.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఉంటున్న తాడేప‌ల్లి నుంచి 5 లేదా 6 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న ప్ర‌ముఖ శైవ క్షేత్రం.. పెద్ద‌కాకాని మ‌ల్లేశ్వ‌రస్వామి ఆల‌యంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న ఇప్పుడు.. స్థానికంగానే కాదు.. రాష్ట్రంలో పెను కుదుపున‌కు దారితీసింది.

 పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి ఆలయం క్యాంటిన్‌లో మాంసాహారం వండటం కలకలం రేపింది. అన్నదానానికి భోజనం సరఫరా చేసే క్యాంటిన్‌లో(ఇది ఆల‌యం ప‌రిధిలోనే ఉంది) కోడి మాంసం వండటం విమర్శలకు తావిచ్చింది. క్యాంటీన్ అధికార పార్టీకి చెందిన నాయకుడిది కావడంతో ఎవరూ నోరు మెదపడం లేదని చెబుతున్నారు. నిత్యం ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడి క్యాంటిన్‌లో అల్పాహారం తయారు చేస్తుంటారు. అన్నదానానికి కూడా ఇక్కడి నుంచి భోజనం సరఫరా చేస్తారు. ఇప్పుడు అదే క్యాంటిన్‌లో కోడి మాంసం వండటం దారుణంగా మారింది.

క్యాంటిన్‌ నిర్వహణను ఓ ప్రైవేటు వ్యక్తి వేలంపాటలో దక్కించుకున్నాడు. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ నేతకు క్యాటరింగ్‌ వ్యాపారం కూడా ఉంది. తనకు వచ్చిన ఆర్డర్లను ఇక్కడే వండి సరఫరా చేస్తుంటాడు. ఇదే క్రమంలో గురువారం ఆలయం ప్రాంగణంలో ఉన్న క్యాంటిన్‌లోనే మాంసాహారం తయారు చేయించి బయటకు పంపించారు. భక్తుల్లో ఒకరు ఇది గమనించి ఫొటోలు తీశారు. విషయం ఆలయ అధికారుల దృష్టికి వచ్చినా వారు నోరు మెదపడం లేదు.

క్యాంటిన్‌ నిర్వాహకులను పిలిచి వివరణ అడిగినట్టు సమాచారం. అయితే, మాంసాహారం బయటే వండానని, ఆర్డర్‌ ఇచ్చే వారికి అందజేసే క్రమంలో మాంసాహారం ఉన్న రిక్షా లోపలికి వచ్చిందని అధికారులకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆలయ వర్గాలతో పాటు స్థానికులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే, అధికార పార్టీ నేత కావడం వల్ల నోరు మెదిపేందుకు జంకుతున్నారు.దీనిపై బీజేపీ, టీడీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.