ఆంధ్ర ప్రదేశ్ విభజన అంశంపై.. కొన్నేళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రముఖుల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఒకరు. తరచుగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పట్లో ఇలా జరిగింది.. తలుపులు మూసేశారు.. మిరియాల కారం కళ్లలో కొట్టారు.. చీకట్లో విభజన చేశారు. ఎవరినీ మాట్లాడనివ్వలేదు.. ఇది పూర్తిగా అశాస్త్రీయం.. అంటూ.. కొన్నాల్లుగా ఉండవల్లి మీడియా ముందుకు వచ్చి ప్రస్తావిస్తున్నారు. దీనిపై ఆధారాలు.. వివరణలు.. పార్లమెంటులో జరిగిన చర్చ వంటివికూడా ఆయన బయటకు చెబుతున్నారు.
గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు కూడా తాను ఈ వివరాలు ఇచ్చానని,, ఆయన చర్యలు తీసుకుని.. పార్లమెంటులో చర్చకు పట్టుబట్టేలా చేస్తానని చెప్పినట్టు ఉండవల్లి వివరించారు. ఈలోగా.. చంద్రబాబు ప్రభుత్వం పడిపోయిందని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్‌కు కూడా ఆయన విన్నపాలు చేశారు. అయితే.. ఇప్పటి వరకు జగన్.. ఎక్కడా స్పందించలేదని ఇటీవల ఉండవల్లి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీనే.. పార్లమెంటులో ఏపీ విభజనపై వ్యాఖ్యలు చేశారని, అసంబద్ధంగా జరిగిందని ఆయనేచెప్పారని.. కాబట్టి మనం గట్టిగా నిలదీయొచ్చని ఆయన కోరారు.
అయితే. జగన్ సర్కారు ఈ విషయాన్ని పక్కన పెట్టింది. కానీ, ఇంతలోనే రాష్ట్రాల విభజన వ్యవహారంలో నియమ నిబంధనలపై ఉండవల్లి అరుణ్ కుమార్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ విభజన విషయంలో తప్పులు జరిగాయని.. నిబంధనలు రూపొందించేలా కేంద్రానికి సూచనలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. విభజన ప్రక్రియ సరైంది కాదని కోర్టును ఆశ్రయించారు. ప్రక్రియ పూర్తయినందున భవిష్యత్‌లో జాగ్రతలు తీసుకోవాలని ఉండవల్లి సవరణ పిటిషన్ వేయగా.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్ను.. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సీజేఐ ధర్మాసనం ముందు ప్రస్తా వించారు. పిటిషన్ దాఖలు చేసి చాలా కాలం అయిందని, ఏపీ విభజనపై ఇటీవల ప్రధాని వ్యాఖ్యలను.. సైతం ఆయన కోర్టులో ప్రస్తావించారు. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు అంగీకరించిన సీజేఐ.. త్వరితగతిన విచారణకు అంగీకారం తెలిపారు. వచ్చే వారంలో లిస్ట్‌లో పొందుపరిచేలా చూడాలని.. సీజేఐ రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంటుంది. అయితే. ఈ క్రమంలో ఇటు ఏపీ ప్రభుత్వానికి, అటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీసులు వస్తే.. వీరు సుప్రీం కోర్టుకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates