వైసీపీలో ఆ న‌లుగురు.. తాడేప‌ల్లి హామీ!

`ఆ న‌లుగురు` మంత్రుల చుట్టూ.. తాడేప‌ల్లి వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. దీనికి కార‌ణం.. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణే. ఇప్ప‌టికే కొత్త మంత్రుల జాబితా రెడీ అయిపోయింది. దీంతో మంత్రులు ఎవ‌ర‌నే విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది .ఈ క్ర‌మంలో కొంద‌రు సీనియ‌ర్లు చూచాయ‌గా స్పందిస్తూ.. ఆ న‌లుగురిని మార్చ‌లేదు.. అని చెబుతున్నార‌ట‌. దీంతో కీల‌క మంత్రుల‌పై ఒక క్లారిటీ వ‌చ్చింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.  

ప్ర‌స్తుతం సీనియ‌ర్లు చెబుతున్న మాట‌ల‌ను బ‌ట్టి… ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్‌రెడ్డిని మార్చే అవ‌కాశం లేదని అంటున్నారు.  ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న అన్ని ఆర్థిక లావేదేవీలు.. బుగ్గ‌న‌తోనే ముడిప‌డి ఉన్నాయి. అదేవిధంగా ఆర్బీఐతోనూ.. అనేక లింకులు ఉన్నాయి. సో.. ఆయ‌నను కాద‌ని.. వేరేవారిని రంగంలోకి తీసుకువ‌స్తే.. ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలుతుంద‌ని.. ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది.

ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌ను మార్చే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టంగా చెబుతున్నారు. ఇక‌, మరో సీనియ‌ర్ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని కూడా మార్చే అవ‌కాశం లేదని సీనియ‌ర్లు చెబుతున్నారు. పార్టీ త‌ర‌ఫున వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డంలో పెద్దిరెడ్డి పాత్ర కీల‌కం. ఎక్క‌డ ఉప ఎన్నిక వ‌చ్చినా.. పెద్దిరెడ్డి పార్టీ బాద్య‌త‌ల‌ను భుజాన వేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను శాఖ మాత్రం మార్చి కొన‌సాగించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని చెబుతున్నారు.

ఇక‌, మ‌రో ఆదిమూల‌పు సురేష్‌.. ఈయ‌న‌ను కూడా మార్చే అవ‌కాశం లేద‌ని సీఎం జ‌గ‌నే స్వ‌యంగా వెల్ల‌డించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఉన్న మంత్రుల్లో సీఎం జ‌గ‌న్‌కు అత్యంత కావాల్సిన మంత్రిగా ఈయ‌న చక్రం తిప్పుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈయ‌న‌ను కూడా మార్చే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. ఇక‌, నాలుగో మంత్రి విష‌యానికి వ‌స్తే… కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి కొడాలి నానిని మార్చరాద‌ని.. జ‌గ‌న్ అనుకుంటున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఆయ‌న స్థానంలో మ‌రో నాయ‌కుడిని తీసుకున్నా.. ఆ త‌ర‌హా ఫైర్‌బ్రాండ్ మాదిరిగా పార్టీ త‌ర‌ఫున‌.. ప్ర‌భు త్వం త‌ర‌ఫున‌గ‌ట్టి వాయిస్ వినిపించే ప‌రిస్థితి లేదు. పైగా.. కొడాలి అన్ని రూపాల్లోనూ పార్టీని, ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్ధిస్తూ.. ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కొడాలిని కొన‌సాగించే అవ‌కాశం ఉంద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. మిగిలిన మంత్రి వ‌ర్గాన్ని పూర్తిగా మార్చేస్తార‌ని.. చెబుతున్నారు. మొత్తంగా ఆ న‌లుగురు మంత్రుల విష‌యంలో కేబినెట్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.