ఈ నెల 4 నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముహూర్తం కుదిరింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇక ఉత్తరాంధ్ర విషయానికే వస్తే శ్రీకాకుళం జిల్లాను 3 జిల్లాలుగా మార్చి విభజించారు. విజయనగరం జిల్లాను రెండు ముక్కలు చేశారు. విశాఖను మూడు ముక్కలు చేశారు. ఈ విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్నీ జిల్లాగా మారుస్తూనే అదనంగా మరో జిల్లాను చేర్చారు. ఈ సారి ఎప్పటి నుంచో అనుకుంటున్న మన్యం జిల్లా తెరపైకి వచ్చింది. దీనికి తెలుగు దేశం పార్టీ విజ్ఞప్తి మేరకు పార్వతీపురం మన్యం అని నామకరణం చేశారు. పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటయ్యే ఈ జిల్లాలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వెళ్లిపోయింది.
అదేవిధంగా ఈ జిల్లాకు ఐటీడీఏ లేకుండా పోయింది కానీ కొత్తగా ఏర్పాటయ్యే మన్యం జిల్లాకు రెండు ఐటీడీఏలు ఉన్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లాకు కొత్తగా ఒక రెవెన్యూ డివిజన్ వచ్చి చేరింది. మంత్రి సీదిరి అప్పల్రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పలాస నియోజకవర్గానికి సంబంధించి రెవెన్యూ డివిజన్ డిక్లైర్ అయింది.దీంతో మంత్రి సమర్థతపైనా, ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయంపైన హర్షద్వానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయాల్లో జూనియర్ అయినప్పటికీ అనుకున్నది సాధించారీయన. అదేవిధంగా తెలుగు దేశం పార్టీ విన్నపం మేరకు నాలుగు దశాబ్దాల విన్నపం వెలుగులోకి వచ్చింది.దీంతో చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ (విజయ నగరం జిల్లా, మంత్రి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం) ఏర్పాటైంది.
ఆఖరు నిమిషంలో శ్రీకాకుళం జిల్లా రాజాం కేంద్రంగా ఓ రెవెన్యూ డివిజన్ వస్తుందని ఆశించినాఫలితం లేకపోయింది. దీంతో ఈ మండలాన్ని చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ లో ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పరంగా ఇప్పుడీ ప్రాంతం విజయనగరం జిల్లాలోనే ఉండనుంది. విశాఖకూ ఓ రెవెన్యూ డివిజన్ ఇచ్చారు. సుందర సముద్ర తీరంతో ప్రకృతి అందాల నడుమ అలరారే భీమిలి ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఎనౌన్స్ చేశారు. జిల్లా అయితే 4 ముక్కలయిపోయింది. విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామ రాజు జిల్లా (పాడేరు కేంద్రంగా) జిల్లాలుగా ఏర్పాటైంది. విశాఖ జిల్లా కూడా ఐటీడీఏ ను కోల్పోయింది. ఇక సుదీర్ఘ కాలంగా వినిపించిన ఏ ప్రతిపాదన కూడా అమలుకు నోచుకోలేదు. శ్రీకాకుళం జిల్లాకు గౌతు లచ్చన్న పేరు పెట్టాలని కోరినా ఆ కోరిక కూడా నెరవేరలేదు. వీటితో పాటు 16 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. అవి కూడా వినలేదు. ముఖ్యంగా అనంత రాజకీయాల్లో బాగా ప్రభావితం చేస్తున్న హిందూపురం జిల్లా ఎనౌన్స్ కాలేదు.
అదేవిధంగా చిత్తూరు జిల్లా నగరిని తిరుపతి జిల్లాలోనే ఉంచాలన్న రోజా డిమాండ్ నెగ్గలేదు. ఈ విధంగా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న ఏరియాను రెండు జిల్లాలలో ఉంచారు. ఒకటి విశాఖలోనూ ఇంకొకటి అనకాపల్లిలోనూ..దీంతో ప్లాంటు ప్రజలకు కాస్త ఇబ్బందే! ముఖ్యంగా పాలన హద్దులు తేలాల్సి ఉంది. పోలీసు డివిజన్ లు, సబ్ డివిజన్ లు తేలాల్సి ఉంది. అధికారులు మరియు ఇతర ఉద్యోగుల నియామకాలు తేలాల్సి ఉంది. వీరి సర్వీసు విషయమై ఎటువంటి నిర్ణయం రానుంది అన్నది కూడా తేలాల్సి ఉంది. అన్నింటి కన్నా ముఖ్యంగా వీరంతా విధులు నిర్వర్తించేందుకు ఇంకా చాలా చోట్ల అద్దె ప్రాతిపదికన కూడా భవనాల గుర్తింపు జరగనే లేదు.
వీటన్నింటి కన్నా ముఖ్యమైన రాష్ట్రపతి ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. ఇన్నీ ఉంటుండగా ఈ నెల నాలుగున తొమ్మిది గంటల 5 నిమిషాల నుంచి తొమ్మిది గంటల 45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల ఏర్పాటు షురూ కానుంది. ఇదే సుముహూర్తం అని సీఎం చెప్పారు.