ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై బీజేవైఎం నేతలు, కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ఘటనపై కేజ్రీవాల్ స్పందించారు. దేశం కోసం ప్రాణాలిస్తానంటూ కేజ్రీవాల్ భావోద్వేగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీలో ఈ-ఆటోలను ప్రారంభించిన సందర్భంగా ఆ ఘటనపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేజ్రీవాల్ ముఖ్యం కాదని, తనకు ఈ దేశమే ముఖ్యమని ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. ఇక, ఈ దాడి ఘటన నేపథ్యంలో బీజేపీ నేతలకు కేజ్రీ చురకలంటించారు. దేశంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ ఇలా గుండాయిజం చేస్తూ దేశ ప్రజలకు తప్పుడు సందేశం పంపిస్తోందని కేజ్రీ విరుచుకుపడ్డారు. ఈ తరహా దాడులకు పాల్పడకూడదని, బీజేపీ అనుసరించే ఈ తరహా చర్యలు దేశ యువతకు తప్పుడు సంకేతాలు పంపుతాయని హితవు పలికారు.
దేనినైనా ఎదుర్కోవటానికి ఈ తరహా వైఖరే సరైన మార్గం అని ప్రజలు అనుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. కలిసికట్టుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని, 75 ఏళ్లుగా ఈ తరహా కలహాలతోనే దేశాన్ని ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉంచామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం పురోగమించదని బీజేపీపై కేజ్రీ మండిపడ్డారు. బుధవారం నాడు తన ఇంటిపై దాడి జరగగా…గురువారం నాడు కేజ్రీవాల్ స్పందించారు.
అంతకుముందు, పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడం, బీజేపీ బొక్కబోర్లా పడడం వంటి ఘటనల నేపథ్యంలోనే కేజ్రీవాల్ పై బీజేపీ నేతలు కుట్రలకు తెరతీశారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో కేజ్రీని ఓడించలేక బీజేపీ ఇలా తమ కార్యకర్తలతో దాడులకు పాల్పడుతోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అయితే, త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికల్లోనూ ఆప్ పోటీచేయనుందని, అక్కడ కూడా కేజ్రీ హవా కొనసాగుతుందేమోనన్న భయంతోనే బీజేపీ ఈ దాడులకు తెగబడుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.