ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచుతూ జగన్ సర్కార్ జనంపై మరో బాదుడుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కరోనా కాటు నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్న జనం నడ్డి విరిచేలా కరెంటు బిల్లులు పెంచారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా లోకేశ్ వినూత్న రీతిలో నిరసనకు దిగారు.
లాంతరు చేతబట్టుకుని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన లోకేశ్…జగన్ సర్కార్ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై ప్రభుత్వం మోయలేని భారం మోపిందని లోకేశ్ ఆరోపించారు. పేద, మధ్య తరగతి కుటుంబాలపై జగన్ అధికభారం మోపారని గతంలో ఎన్నడూలేని విధంగా విద్యుత్ చార్జీలు పెంచారని లోకేశ్ మండిపడ్డారు. ఉగాది రోజు జగన్ మరో మోసపూరిత పథకాన్ని అమల్లోకి తెచ్చారని ఎద్దేవా చేశారు.
ట్రూ ఆప్ అంటూ అనేక పేర్లతో విద్యుత్ చార్జీలు పెంచి డబ్బు లాగేశారని లోకేశ్ ఆరోపించారు. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు విజనరీ ఆలోచనలతో రాష్ట్రాన్ని వెలుగుల వైపునకు తీసుకువెళ్లారని, కానీ, ప్రిజనరీ ఆలోచనలతోనే జగన్ జనంపై విద్యుత్ చార్జీల భారం మోపి చీకట్లలోకి నెట్టేస్తున్నారని సెటైర్లు వేశారు. ఇకనైనా…కక్షసాధింపులు మాని పాలనపై జగన్ దృష్టి పెట్టాలని సూచించారు.
విద్యుత్ ఛార్జీలు పెంచి అడ్డగోలుగా ప్రజల్ని జగన్ దోచుకుంటున్నారని, చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీల పేరుతో బాదుడే బాదుడని లోకేశ్ ఎద్దేవా చేశారు. వైసీపీ చెత్త పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారప్రదేశ్ గా మార్చేసారని చురకలంటించారు. పేద ప్రజల నడ్డి విరిచేలా పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates