కోర్టు ధిక్కరణ కేసులో ఆగ్రహానికి గురైన 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించిన వైనం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, వారంతా కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో శిక్ష తప్పింది. దానికి బదులుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ 8 మంది ఐఏఎస్ లను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పాటు ప్రతీ నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతల పాపాలకు అధికారులు బలవుతున్నారన్న అర్థం వచ్చేలా నాగబాబు చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఏపీలో 8 మంది ఐఏఎస్ అధికారులు కోర్టు శిక్షకు గురయ్యారని తెలిసిందని, అయితే, ఇందులో అధికారుల పాత్ర ఏమీ ఉండదని నాగబాబు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గ్రామ సచివాలయాలు నిర్మించాలని అధికారులు తీర్మానించి ఉండరని అభిప్రాయపడ్డారు.
అవన్నీ వైసీపీ ప్రజాప్రతినిధుల నిర్ణయాలే అయి ఉంటాయని అభిప్రాయపడ్డారు. కోర్టు శిక్షకు గురైన 8 మంది ఐఏఎస్‌లు మంచి సమర్థులైన అధికారులేనని కితాబిచ్చారు. పరిపాలన ఇలా ఉండకూడదనే విషయానికి ఏపీ ప్రభుత్వమే ఉదాహరణ అని అన్నారు. వైసీపీ పాలనలో సమాజానికి, రాజ్యాంగానికి సంరక్షకులు(వాచ్ డాగ్స్)గా ఉండాల్సిన అధికారులు వైసీపీ మాయలో పడిపోయారని షాకింగ్ కామెంట్లు చేశారు.
వారంతా ఇప్పుడు వైసీపీ పెంపుడు జంతువులు (పెట్స్)గా మారిపోయారంటూ నాగబాబు సంచలన ఆరోపణలు గుప్పించారు. అందుకే, ఇతర అధికారులకు గుణపాఠంలా వీరిని శిక్షించాలని నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates