మహమ్మారి వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాణాంతక వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనేందుకు పలు దేశాల శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చేవరకు ఈ మహమ్మారిని నియంత్రించే సమర్థవంతమైన ఔషధాన్ని తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించారు. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సకు తొలి ఓరల్ ఔషధాన్ని తయారు చేసిన ఘనత మన దేశానికి దక్కింది. కరోనా చికిత్సకు మందును భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ ఆవిష్కరించింది. ‘ఫాబిఫ్లూ బ్రాండ్’ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మందు మార్కెట్లోకి విడుదలయ్యేందుకు అవసరమైన అనుమతులను భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి గ్లెన్ మార్క్ పొందింది. కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై ఫాబిఫ్లూ ట్యాబ్లెట్ బాగా పనిచేస్తోందని గ్లెన్ మార్క్ వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేశామని, ఆ తర్వాతే మందును మార్కెట్లోకి విడుదల చేయబోతున్నామని పేర్కొంది.
దేశవ్యాప్తంగా సాధ్యమైనంత ఫాబిఫ్లూను వీలైనంత త్వరలో అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ఫాబిఫ్లూ విక్రయిస్తామని, ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ.103గా ఉంటుందని సంస్థ ఛైర్మన్ గ్లెన్ సల్దన్హా వెల్లడించారు. కరోనా సోకిన వారు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను తొలి రోజు రెండు సార్లు వేసుకోవాలని.. ఆ తర్వాత వరుసగా 14 రోజుల పాటు 800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను రోజుకు రెండు సార్లు చొప్పున వాడాలని అన్నారు. కరోనాపై ఫాబిఫ్లూనే తొలి ఓరల్ ఔషధమని, కరోనా లక్షణాలు స్వల్ప, మధ్య స్థాయిలో ఉన్న డయాబెటిక్, గుండె జబ్బు వ్యాధిగ్రస్తులు కూడా ఈ ఔషధాన్ని వాడవచ్చన్నారు. నాలుగు రోజుల్లోనే వైరల్ లోడ్ ను ఫాబి ఫ్లూ తగ్గిస్తుందని వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates