ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ మాటలు కోటలు దాటుతాయేకానీ.. ఆయన చేతలు తాడేపల్లి ప్యాలెస్ కూడా దాటవని ఆయన ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా బస్సు ప్రమాదంలో మరణించినవారికి రూ.2 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని ఆరోపించారు. అందుకే జగన్ మోసపు రెడ్డి మాటలు కోటలు దాటతాయే కానీ.. చేతలు తాడేపల్లి ప్యాలెస్ కాంపౌండ్ కూడా దాటవని తను అంటున్నానని ఆయన చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చి సరిపెట్టడం సరికాదన్నారు. ఈ విషయంలో జగన్ గతంలో ఏం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని.. లోకేష్ సూచించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వడమేంటని జగన్ ప్రశ్నించారన్న లోకేష్.. ఇప్పుడు చిత్తూరు జిల్లా భాకరపేట సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన 9 మంది కుటుంబాలకు విషయంలో చేస్తున్నదేంటని నిలదీశారు. అప్పుడు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాడ్ చేసిన జగన్.. ఇప్పుడు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. తాము కొత్త డిమాండ్లు ఏమీ పెట్టడం లేదని.. ఆనాడు జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ‘నాడు-నేడు’ పేరిట జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియోను లోకేశ్ విడుదల చేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్.. టీడీపీ ప్రబుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని ప్రభుత్వం ఉదారంగా ఆదుకోకపోతే.. ఆ కుటుంబాలు ఎలా జీవనం సాగిస్తాయని.. ఆనాడు ఆయన పేర్కొన్నారు. ఆ కుటుంబాల్లోని చిన్న పిల్లలు.. వృద్ధులు అనాథలు మారిపోతే.. ప్రభుత్వానికి కనీసం జాలి కూడా లేదా? ఈ చంద్రబాబుకు మనసు కూడా లేదా? అని ఆనా డు ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాలను తాజాగా.. లోకేష్ ప్రస్తావించారు. మరి ఇప్పుడు ఆ సూక్తులు ఏమయ్యాయని.. నిలదీశారు.
ప్రతి కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేయడం గమనార్హం. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరోవైపు గత ఏడాది వరకు.. రాష్ట్రంలో ఎక్కడ ప్రమాదం చోటు చేసుకున్నా.. రూ.5 లక్షలకు తగ్గకుండా.. ప్రమాద బాధిత కుటుంబాలకు ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇటీవల కాలంలో తొలిసారి.. ఈ మొత్తాన్ని రూ.2 లక్షలకు తగ్గించడంపై నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు.. జగన్ ఆర్తిక వ్యవస్థను కళ్లకు కడుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందులు పడుతోందో .. ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయని అంటున్నారు.