`48 వేల కోట్ల‌`కు రాజ‌కీయ రంగు.. ఏం తేలిన‌ట్టు!

ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మ‌రో కొత్త వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌ల్తీసారా, జేబ్రాండ్స్ అంటూ.. పెద్ద ఎత్తున టీడీపీ, వైసీపీల మ‌ధ్య రాజ‌కీయం సాగిన విష‌యం తెలిసిందే. దీని పై.. ఇరు పార్టీల నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకున్నారు. అసెంబ్లీ ముగియ‌డంతో .. ఈ వివాదం కూడా ముగిసిపోయింది. అయితే.. ఇప్పుడు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడు మ‌రో సంచ‌ల‌న విష‌యం తెర‌మీదికి తెచ్చారు. రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం లెక్క‌లు చూప‌ని.. 48 వేల‌ కోట్ల‌ను నొక్కేసింద‌ని.. ఆరోపించారు.

రూ.48 వేల కోట్లు కూడా ప్ర‌భుత్వ పెద్ద‌ల జేబుల్లోకి వెళ్లాయ‌న‌న్నారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కాగ్ చూపించిన లెక్క‌లు, లోపాల‌ను వెల్ల‌డించారు. అయితే.. ఈ విష‌యంపై వైసీపీ ప్ర‌భుత్వం ఆస‌క్తిగా స్పందించింది. . యనమల చెబుతున్న 48వేల కోట్లు వాస్తవిక వ్యయం కాదని ఆర్థిక మంత్రి బుగ్గ‌న వివ‌రించారు. అంతేకాదు, ఆ మొత్తం ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జరిగిన ‘బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్‌’ అనే విషయం గ్రహించాలని సూచించారు. మొత్తానికి ఈ 48 వేల కోట్ల విష‌యం.. రాజ‌కీయంగా దుమారం రేపుతోంది.

సీఎఫ్ఎంఎస్‌లో స్పెషల్‌ బిల్లులంటూ ఏమీ ఉండవని మంత్రి బుగ్గ‌న చెప్ప‌డం.. ఈ క్ర‌మంలోనే టీడీపీ గ‌త స‌ర్కారుపై ఆయ‌న విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. చంద్రబాబు హయాంలో అస్తవ్యస్తంగా, తప్పుల తడకగా రూపొందించిన సీఎఫ్ఎంఎస్‌ వ్యవస్థ ఈ గందరగోళానికి  కారణమైందన్నారు. ఈ వ్యవస్థలో బిల్లుల చెల్లింపులకు బీఎల్ఎం మాడ్యూల్‌ను పొందు పర్చారని.. ట్రెజరీ కోడ్‌ ప్రకారమే ఈ బిల్లుల చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేశారని అన్నారు.

అసలు ఈ వ్యవస్థలో స్పెషల్‌ బిల్లుల హెడ్‌ లేనే లేదన్న‌ది మంత్రి చెబుతున్న మాట‌. సీఎఫ్ఎంఎస్‌ రిపోర్టింగ్‌ విధానంలో ‘బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్స్‌’ను గుర్తించడం కోసం స్పెషల్‌ బిల్లులు అనే పేరు పెట్టామ‌న్నారు. అంతే తప్ప స్పెషల్‌ బిల్లుల హెడ్‌ అనేది లేనే లేదన్నారు. అయితే.. య‌న‌మ‌ల దీనికి కౌంట‌ర్ ఇచ్చారు. సీఎఫ్ఎంఎస్  బైపాస్ చేయడం, ట్రెజరీ కోడ్ ఉల్లంఘన, ప్రత్యేక బిల్లుల పేరుతో అనుచిత రాటిఫికేషన్లు, అక్రమ బిల్లులు పాస్ చేసుకోవడానికి అవాంఛితంగా జీవో నెంబర్‌ 80 జారీ చేయడం వంటి లొసుగులన్నీ బయటపడేసరికి దిక్కుతోచకే ఎదురుదాడికి దిగారని ధ్వజమెత్తారు.

ఏపీలో ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ విధించాలని, ఆర్టికల్ 360 తక్షణమే ప్రయోగించాలని కేంద్రాన్ని కోరుతు న్నట్లు య‌న‌మ‌ల మ‌రోసారి పునరుద్ఘాటించారు. దీంతో ఇప్పుడు అధికార‌, విప‌క్షాల మ‌ధ్య 48 వేల కోట్ల రూపాయ‌ల వివాదం.. రాజ‌కీయ రంగు పులుముకుంది. మ‌రి ఇది ఎటు దారితీస్తుందో చూడాలి. అయితే.. చిత్రంగా ఏస‌మ‌స్య అయినా.. రెండు మూడు రోజుల‌కు మించి ఎక్కువ‌గా హ‌ల్చ‌ల్ చేయ‌డం లేదు. మ‌రి ఇది కూడా అలానే కాలంలో క‌లిసి పోతుందో.. లేక ప్ర‌జాధ‌నానికి స‌మాధానం ల‌భిస్తుందో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.