వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో జరుగుతున్న రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇక్కడ రెండు కేంద్రాలుగా రాజకీయాలు జరుగుతున్నాయని వైసీపీలోనే గుసగుస వినిపిస్తోంది. ఇద్దరు సీనియర్ నాయకులు తాడేపల్లి రాజకీయాలపై పూర్తిస్థాయిలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అందుకే.. వారు అక్కడే తిష్టవేసి ఉంటున్నారని.. చెబుతున్నారు. ప్రతి విషయాన్నీ సానుకూలంగా తీసుకునే నాయకుడు ఒకరైతే.. ప్రతి విషయాన్ని హాట్ టాపిక్‌గా తీసుకునే నాయకుడు మరొకరని.. చర్చ జరుగుతోంది.
వాస్తవానికి తాడేపల్లిలోకి ఎంట్రీ ఇవ్వాలంటే.. గతంలో ఒక కీలక నాయకుడి అనుమతి ఉండాలనే విషయంపై పార్టీ నేతల్లో చర్చ సాగేది. అంటే.. ఎమ్మెల్యేలు, దిగువ స్థాయి నాయకులు.. ముఖ్యమంత్రిని కలవాలంటే.. ఖచ్చితంగా సదరు నాయకుడిని కలిసి మచ్చిక చేసుకుంటే.. తప్ప.. ఫలితం ఉండదనే పేరు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎనలేని ప్రాధాన్యం పెరిగిపోయింది. అయితే.. ఇటీవల కాలంలో గుంటూరుకు చెందిన ఒక కీలక నాయకుడు కూడా ఇక్కడ వీఐపీగా చలామణి అవుతున్నారని.. వైసీపీలోనే చర్చగా మారడం గమనార్హం. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన రాజకీయాలను, రాజకీయ నేతలను ఈయన మేనేజ్ చేస్తున్నారని.. నేతలు చర్చించుకుంటున్నారు.
పార్టీలోనూ.. బయటా కూడా.. కీలకంగా మారుతున్నారని.. ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా.. ఈ రెండు జిల్లాల నేతలు.. ఈయనను కలుస్తున్నారని.. తాడేపల్లిలో పెద్ద ఎత్తున గుసగుస వినిపిస్తుండడం గమనార్హం. అయితే.. ఇది అధికారికంగా సీఎం జగన్ ఇచ్చినదేనా.. లేక ఆయన స్వయంగా తీసుకున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే.. ముఖ్యమంత్రిని కలవాలని ఎవరైనా వస్తే.. ముందుగా వీరి దర్శనం చేసుకోవాలి. ఈ ఇద్దరు నేతల్లో ఎవరు కాదన్నా.. ఇక, సీఎం దర్శనం కానట్టేనట! ఈ రేంజ్‌లో అధికారం చెలాయిస్తున్నారట. వీరిద్దరూ కూడా జగన్ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం.. గమనార్హం.
వీరిలో ఒకరు గత ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దీంతో ఆయన కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మరొకరు.. జగన్ సంస్థలకు కీలక అధికారిగా పనిచేశారు. అయితే.. ఇలాంటి నాయకులు చాలా మంది ఉన్నారని.. కానీ, ఈ ఇద్దరిలోనూ.. మరింత ప్రత్యేకత ఉండి ఉంటుందని.. అందుకే జగన్ అంత ప్రాధాన్యం ఇస్తున్నారని.. వైసీపీలో చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. అయితే.. ఈ రెండు కేంద్రాలు సానుకూలంగా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఎక్కడైనా తేడా వస్తే.. మాత్రం ఇబ్బందేనని నేతలు భావిస్తున్నారు. “ప్రతి విషయాన్నీ వారికే చెప్పాలి. ముందు వారి అనుమతి తీసుకోవాలి.. ఇలా అయితే.. ఎలా?“ అని తూర్పుగోదావరికి చెందిన ఒక కీలక నేత.. బాహాటంగానే అనేశారు. మరి దీనిని బట్టి.. వీరిపై వ్యతిరేకత పెరుగుతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇంకా వీరిని కొనసాగిస్తారా? లేక.. ఇక్కడితో కట్ చేస్తారా? అనేది చూడాలి.