సీఆర్డీఏకు లీగల్ నోటీసులు

పరిహారం కోరుతు రాజధాని అమరావతి రైతులు సీఆర్డీఏ కి లీగల్ నోటీసులు పంపారు. భూసమీకరణ నిబంధనల ప్రకారం తమ నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం మాట తప్పినందుకు తమకు పరిహారం ఇవ్వాల్సిందే అంటూ కొందరు రైతులు లీగల్ నోటీసులు జారీ చేశారు. వంశపారంపర్యంగా వచ్చిన భూములను రాజధాని నిర్మాణం చేస్తామంటే భూసమీకరణలో ఇచ్చామన్నారు.

భూసమీకరణలోని నిబంధనల ప్రకారం తుది ప్రకటన ఇచ్చిన ఏడాదిలోగా ప్లాట్ల విభజన, రోడ్లు నిర్మించి, భౌతికంగా ప్లాట్లను స్వాధీనం చేయాల్సిన ప్రభుత్వం చేయలేదన్నారు. మూడేళ్ళల్లో దశలవారీగా ఏర్పాటు చేయాల్సిన మౌళికవసతులను కూడా చేయలేదని నోటీసులో చెప్పారు. రైతులు ఇచ్చిన లీగల్ నోటీసుల ప్రకారం 2016, డిసెంబర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూసమీకరణకు తుది ప్రకటన ఇచ్చింది. అంటే 2017, డిసెంబర్ చివరలోగా ప్లాట్ల విభజించి, రోడ్ల నిర్మించి, భౌతికంగా ప్లాట్లను స్వాధీనం చేయలేదు. 

అయితే, అప్పట్లో ప్రతిపక్షాలు, కొందరు మేధావులు పర్యావరణ కేసులు వేసి ప్రాజెక్టు పనులు జరగకుండా చూశారు. దీంతో సీఆర్డీఏ చట్టం ప్రకారం చేయాల్సిన పనులను చంద్రబాబు ప్రభుత్వం చేయలేదని అర్ధమవుతోంది. దీని వల్ల 2019, డిసెంబర్లోగా రాజధానిలో అన్నీ రకాలుగా అభివృద్ధిచేసి, మౌళిక సదుపాయాలను అప్పటి ప్రభుత్వం  ఏర్పాటు చేయలేకపోయింది. 2019, మే లో ప్రభుత్వం మారి చంద్రబాబు స్ధానంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.  జగన్ కూడా ఆరుమాసాల్లో పనులు చేపట్టలేదు.

అసలు అమరావతి రాజధానే కాదనేశారు. దాంతోనే రాజధాని పనులు తిశంకుస్వర్గంలో ఉండిపోయాయి. ఈమధ్య హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మళ్ళీ కదలిక వస్తుందని అందరూ అనుకుంటున్నారు. మరి జగన్ ఏమి చేస్తారో చూడాలి. కారణాలు ఏవైనా  వైసీపీ వ్యవహారం వల్ల రాజధాని రైతులు నిలువునా ముంచిన విషయం తాజా లీగల్ నోటీసుల్లో స్పష్టమవుతోంది. భూసమీకరణ తదితరాలను రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ (రెరా) ప్రకారం రిజిస్టర్ చేయాలట.   తాము కోరినట్లు పరిహారం ఇవ్వకపోతే హైకోర్టులో కేసు వేస్తామని రైతులు తమ లీగల్ నోటీసులో స్పష్టంగా చెప్పారు. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.