నా ఆస్తి పందెం… జగనే మళ్లీ సీఎం: ఏపీ మంత్రి

తమకున్న ఆత్మవిశ్వాసాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తుంటారు. అందుకు భిన్నంగా తాను అమితంగా అభిమానించి ఆరాధించే అధినాయకుడి గురించిన ఆత్మవిశ్వాసాన్ని చాలా తక్కువ మంది ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు ఆ కోవలోకే చేరారు ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. తాజాగా ఆయనో భీకర సవాలు విసిరారు. ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితుడన్న పేరున్న ఆయన.. జగన్ కు వీర విధేయుడన్న సంగతి తెలిసిందే.

తాజాగా శ్రీకాకుళం జిల్లా పోలాకి..చెల్లాయి వలసలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి సంచలన సవాలు బయటకు వచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉంది. అయినప్పటికీ.. ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో.. ఏ క్షణంలో అయినా ఎన్నికలు వస్తాయన్న మాట వినిపిస్తూ ఉంది. విపక్ష నేత ఇప్పటికే పలుమార్లు.. ఎన్నికలకు సిద్దంగా ఉండాలంటూ తమ పార్టీ నేతలకు.. క్యాడర్ కు తరచూ చెబుతున్న సంగతి తెలిసిందే.
దీంతో.. ఎన్నికల హీట్ రెండేళ్ల ముందే మొదలైంది.

ఇలాంటి వేళ.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుపై సంచలన వ్యాఖ్యలు చేవారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. అంతేకాదు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు ఆయనో సవాలు విసిరారు. ఒకవేళ ఏపీ ఎన్నికల్లో జగన్ మరోసారి ముఖ్యమంత్రి కాకుంటే.. తన ఆస్తులు మొత్తాన్ని రాసి ఇచ్చేస్తానని చెప్పుకొచ్చారు.

రాష్ట్రానికి వైఎస్ జగన్ లాంటి ముఖ్యమంత్రి నభుతో నభవిష్యతి అంటూ ఆకాశానికి ఎత్తేసిన ఆయన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
జగన్ ను అభిమానించి.. ఆరాధించే మంత్రులు.. నేతలు.. క్యాడర్ చాలానే ఉన్నా.. ఈ తరహాలో ఉన్న ఆస్తి మొత్తాన్ని రాసిచ్చేస్తానంటూ సంచలన సవాలు మాత్రం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఒక్కరికే చెల్లిందని చెప్పాలి. ఏమైనా.. అందరి మంత్రుల్లో ధర్మాన ఇస్పెషల్ అన్న రీతిలో ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. అదే సమయంలో.. జగన్ విజయం మీద ఆయనకున్న నమ్మకం తాజా సవాలుతో స్పష్టమవుతుందన్న మాట వినిపిస్తోంది.