ఆ క్రికెట‌ర్‌ కోసం పార్టీల వేట‌!

వివిధ క్రీడ‌ల్లో త‌మ ప్ర‌దర్శ‌న‌తో గొప్ప పేరు తెచ్చుకున్న ఆట‌గాళ్లు రాజకీయాల్లో అడుగుపెట్ట‌డం కామ‌నే. గ‌తంలో కంటే కూడా ఇప్పుడు క్రికెట‌ర్లు ఎక్కువ‌గా రాజ‌కీయాల‌పై ఆస‌క్తి చూపిస్తున్నారు. ఉత్త‌రాది రాష్ట్రంలో ఈ ట్రెండు ఎక్కువ‌గా ఉంది. న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ, మ‌నోజ్ తివారీ, గౌత‌మ్ గంభీర్‌.. ఇప్పుడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఇలా క్రికెట‌ర్లు రాజ‌కీయాల్లో అడుగుపెట్టారు. తాజాగా హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఆప్ త‌ర‌పున రాజ్య‌స‌భ స‌భ్యుడు కాబోతున్నారు. క్రికెట‌ర్లు రాజ‌కీయాల్లోకి రావ‌డం మ‌న తెలుగు రాష్ట్రాల్లో త‌క్కువ‌నే చెప్పాలి. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ అజ‌హ‌రుద్దీన్ మిన‌హా మిగ‌తా ఎవ్వ‌రు కూడా రాజ‌కీయాల‌పై ఆస‌క్తి చూప‌లేద‌ని చెప్పాలి.

కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన క్రికెట‌ర్లు రాజ‌కీయ ఆట‌లో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు ఆస‌క్తి చూపిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. పొలిటిక‌ల్ గేమ్ ఆడేందుకు తెలుగు క్రికెట‌ర్లు సిద్ధ‌మ‌వుతున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రా క్రికెట‌ర్ అంబ‌టి రాయుడిని రాజ‌కీయాల్లోకి తెచ్చేందుకు ఏపీలోని రెండు ప్ర‌ధాన పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొన్న భార‌త జ‌ట్టులో చోటు ద‌క్క‌లేద‌నే కోపంతో ఆయ‌న ఆట‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించినప్ప‌టికీ తిరిగి త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌పున ఆడేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఆంధ్రాకే చెందిన మ‌రో టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ వేణుగోపాల రావు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌సేన పార్టీలో చేరిన ఆయ‌న కొన్నాళ్ల‌పాటు యాక్టివ్‌గానే ఉన్నారు.

కానీ ఈ మ‌ధ్య మ‌ళ్లీ సైలెంట్ అయిపోయారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న తిరిగి యాక్టివ్ అవుతార‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌పున వేణుగోపాల‌రావు పోటీ చేస్తార‌ని టాక్‌. మ‌రోవైపు అంబటి రాయుడు కోసం ఏపీలోని రెండు ప్ర‌ధాన పార్టీలు క‌న్నేశాయ‌నే చ‌ర్చ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన త‌ర్వాత రాయుడు పొలిటిక‌ల్ కెరీర్ మీద ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.