వైసీపీపై ‘జ‌న‌సేన’ ఎఫెక్ట్‌

అధికార పార్టీ వైసీపీ పై జ‌న‌సేన ఎఫెక్ట్ ప‌డిందా?  సీఎం జ‌గ‌న్ యుద్ధ‌ప్రాతిప‌దిక క‌దిలారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీలకులు. తాజాగా జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో పార్టీ అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తూనే.. అధికార పార్టీపై విరుచుకుప‌డ్డారు. కొమ్ములు విరిచేస్తాం.. అధికారంలోంచి దింపేస్తాం.. అంటూ.. వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అత్యంత కీల‌క‌మైన ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌కుండా.. జాగ్ర‌త్త‌లు ప‌డ‌తామ‌ని చెప్పారు. ఇవే వ్యాఖ్య‌లు అధికార పార్టీలో గుబులు రేపాయి. సాధార‌ణంగా.. అధికారంలోంచి దించేస్తాం.. అన‌డం కామ‌నే.. అయినా.. ప్ర‌భుత్వ  వ్య‌తిరేక ఓటును చీల‌కుండా చేస్తాం.. అని చెప్ప‌డం.. అధికార పార్టలో చ‌ర్చ‌కు దారితీసింది.

ఎందుకంటే.. ఎన్ని ప‌నులు చేసినా.. ఎన్ని సంక్షేమాలు చేసినా.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌నేది వాస్త‌వం. ముఖ్యంగా అభివృద్ధి లేద‌ని.. పోలీసుల ఆగ‌డాలు పెరిగాయ‌ని.. ప్ర‌జల‌కు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయిందని.. త‌మ గోడు ప‌ట్టించుకునే నాధుడు లేర‌ని.. ప్ర‌జ‌లు శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు కూడా భావిస్తున్నారు. ఇదంతా వ్య‌తిరేక ఓటు బ్యాంకుగా మార‌డం ఖాయం. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వ్య‌తిరేక ఓటు.. ఏదో ఒక పార్టీప‌డినా.. త‌మ‌కు పెద్ద‌గా ఇబ్బంది లేద‌ని.. వైసీపీ నాయ‌కులు భావించారు. కానీ, ఇప్పుడు ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో.. ఇలా ఇక‌పై రజ‌ర‌గ‌బోద‌ని.. వైసీపీ నేత‌ల‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ముఖ్యంగా పార్టీ అధిష్టానానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల సెగ‌లు బాగానే త‌గిలిన‌ట్టు క‌నిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ప‌క్క‌న పెట్టిన శాస‌న స‌భా ప‌క్ష స‌మావేశాన్ని హుటాహుటిన నిర్వ‌హించారు.. వాస్త‌వానికి ఈ శాస‌న స‌భా ప‌క్ష స‌మావేశం ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ, శాస‌న మండ‌లి స‌మావేశాల త‌ర్వాత నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. కానీ, ఎందుకో.. సీఎం జ‌గ‌న్ మంగ‌ళ‌వార‌మే నిర్వ‌హించారు. అంతేకాదు.. స‌భ్యుల‌కు త‌లంటేశారు కూడా.! అంతేకాదు.. ఎమ్మెల్యేల ప‌నితీరు బాగులేకుంటే.. టికెట్లు కూడా ఇచ్చేది లేద‌ని తెగేసి చెప్పేశారు. అంతేకాదు.. గ్రామ స్థాయిలో, ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర స్థాయిలో ప్ర‌తి ఇంటికీ ఒక్కొక్క ఎమ్మెల్యే మూడు నుంచి నాలుగు సార్లు తిర‌గాల‌ని దిశానిర్దేశం చేశారు. ఓట‌ర్ల‌ను పేరు పెట్టి పిలిచే స్థాయిలో నాయ‌కులు ఉండాల‌ని అన్నారు.

అంతేకాదు..వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఒక యుద్ధంగా జ‌గ‌న్ పేర్కొన‌డాన్ని బ‌ట్టి.. ప‌వ‌న్ చేసిన విమ‌ర్శ‌లు.. వ్యూహాల‌పై జ‌గ‌న్ బాగానే దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఒక‌వైపు.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను ఖండించేందుకు మంత్రుల‌ను రంగంలోకి దింపినా.. పవారితో ప్ర‌తి విమ‌ర్శ‌లు చేయించినా.. వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో పరిస్థితిని స‌మీక్షించుకున్న జ‌గ‌న్ నేరుగా త‌నే రంగంలోకి దిగిపోయారు. ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే గ‌డ‌ప గ‌డ‌ప‌కు తిర‌గాల‌ని దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని చెప్పారు. అంతేకాదు.. ప్ర‌తి ఒక్క‌రూ.. పార్టీ కోసం ప‌నిచేయాల‌ని.. లేక పోతే.. తీవ్ర చ‌ర్య‌లు తప్ప‌వ‌ని హెచ్చ‌రించేశారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీపై జ‌న‌సేన ఎఫెక్ట్ బాగానే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.