2019 ఎన్నికలకు ముందు తెలుగు సినీ పరిశ్రమ నుంచి చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ప్రముఖులు వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ కోసం ప్రచారం చేశారు. జగన్ సీఎం అయితే అద్భుతాలు జరిగిపోతాయని అన్నారు. ఇప్పుడు ఆ ప్రముఖులెవరూ కూడా జగన్ సర్కారు పాలన బాగుందని ధీమాగా మాట్లాడే పరిస్థితి లేదు. పోసాని లాంటి వాళ్లు జగన్ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు తప్పితే.. ప్రభుత్వ పాలన గురించి గొప్పగా మాట్లాడే పరిస్థితి అయితే లేదు.
ఆయన కానీ, వైకాపాకు మద్దతిచ్చిన మిగతా సినీ జనాలు కానీ జగన్‌ను ఇంకోసారి సీఎం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చే సీన్ ఉందా అంటే డౌటే. ఇలాంటి సమయంలో ఒకప్పటి స్టార్ హీరో సుమన్.. జగన్‌కు, ఆయన ప్రభుత్వానికి ఓ రేంజిలో ఎలివేషన్లు ఇవ్వడం విశేషం. జగన్‌ను ఇంకో రెండుసార్లు సీఎంను చేయాలని ఆంధ్రా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యమని ఆయనన్నారు.విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో సుమన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు దఫాలు ఒకే వ్యక్తికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని సుమన్ అన్నారు.
గత ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని, కానీ వైసీపీ ప్రభుత్వం నవరత్నాలతో పేద ప్రజల ముఖాల్లో చిరునవ్వును నింపిందని సుమన్ అన్నారు. ఇంకో రెండుసార్లు జగన్ సీఎంగా ఉంటే రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందని సుమన్ వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ కోసం జగన్ ప్రభుత్వం చేయాల్సిన దాని కంటే ఎక్కువే చేసిందని.. టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయించినా తమకు సమ్మతమే అని ఆయనన్నారు.
ఏపీలో ఎన్నో మంచి లొకేషన్లు ఉన్నాయని, టాలీవుడ్ నిర్మాతలు ఇక్కడికి వచ్చి షూటింగ్ చేయాలని సుమన్ కోరారు. ఇప్పుడు పూర్తిగా ఫేడవుట్ అయిపోయిన సుమన్‌ను మామూలుగా అయితే ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు కానీ.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ సర్కారుకు ఇలా ఎలివేషన్లు ఇచ్చేసరికి ఆయన్ని నెటిజన్లు మామూలుగా ఆడుకోవట్లేదు. ఒకసారి ఛాన్స్ ఇస్తే జరిగిన విధ్వంసం చాలదా.. ఇంకో రెండుసార్లు సీఎంను చేయాలా.. సినీ పరిశ్రమను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంటే ఎంతో చేసిందని అంటారా అంటూ ఆయన మీద విరుచుకుపడుతున్నారు సోషల్ మీడియాలో.
Gulte Telugu Telugu Political and Movie News Updates