ఏపీ భవిష్యత్ రాజకీయాల్ని ప్రభావితం చేసే కీలక వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చింది. పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన ఎజెండా ఏమిటన్న విషయాన్ని స్పష్టం చేసిన ఆయన మాటలు వింటే.. ఏపీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీసేలా మారిందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
పొత్తులపై ఆయన సింగిల్ మాటతో తేల్చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో తీల్చమన్న పవన్ మాటల్ని చూసినప్పుడు.. రానున్న రోజుల్లో విపక్ష టీడీపీతో జట్టు కట్టే విషయాన్ని ఆయన కొట్టి పారేయలేదు. అంతేకాదు..అందుకు తన మిత్రపక్షమైన బీజేపీ మాట కోసం ఎదురు చూస్తున్నానన్న విషయాన్ని ఆయన చెప్పేశారు. జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. వైసీపీ సర్కారు తీరును ఆయన సూటిగా స్పష్టం చేశారు. ‘‘వైసీపీది విధ్వంసం.. జనసేనది వికాసం. వారిది అధిపత్యం.. మనది ఆత్మగౌరవం.
అది అహంకారానికి అడ్డా.. ఇది జనసైనికుల గడ్డ’ అంటూ ఆవేశపూరితంగా మాట్లాడిన ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇదే సభలో ఏపీ రాజధానిగా అమరావతినే ఉంటుందని తేల్చిన ఆయన.. రాజధానిగా అమరావతి ఉంటుందని.. అలా అని మిగిలిన ప్రాంతాల్ని వదిలేస్తామని తాను చెప్పటం లేదన్న పవన్.. ‘‘నేను నలుగురికీ ఇచ్చే వాడినే కానీ అడిగేవాడిని కాదు. పది మందికీ పెట్టేవాడినే గానీ.. దోచుకునేవాడిని కాదు. అందరూ బాగుంటే చాలనుకునేవాడిని. అయిదేళ్లకోసారి వచ్చే ఎన్నికల కోసం.. అధికారం కోసం ఆలోచించేవాణ్ని కాదు. పుట్టబోయే బిడ్డలు.. ఎదుగుతున్న తరం భవిష్యత్తుకు ఏం చేయాలని ఆలోచించేవాణ్ని’’ అంటూ చెప్పిన మాటల్ని చూస్తే.. పవన్ విజన్ స్పష్టంగా తెలిసేలా చేసిందని చెప్పాలి.
వచ్చే ఎన్నికల్లో ఉండే పొత్తులకు సంబంధించిన పవన్ నోటి నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆయనేం చెప్పారన్నది ఆయన మాటల్లోనే వింటే.. ‘‘ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులన్నీ ఎలా కలిశాయో.. అలా వైసీపీ వ్యతిరేక శక్తులన్నీ కలసి ఆ పార్టీని గద్దె దించాలన్నదే మా లక్ష్యం. పార్టీ వ్యక్తిగత లాభాల్ని విడిచిపెట్టి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వస్తే పొత్తుల గురించి ఆలోచిస్తా. ఏపీ బాగు కోసం ఈ రోజు సభాముఖంగా చెబుతున్నా. బీజేపీ నాయకులు.. పెద్దలు నాకు రోడ్ మ్యాప్ ఇస్తానని చెప్పారు. దాని కోసం ఎదురుచూస్తున్నా. వైసీపీని ఎలా గద్దె దించాలో చెప్పండి. మేం చేస్తాం’ అంటూ చెప్పేసిన తీరు చూస్తే.. బీజేపీ అధినాయకత్వానికి తాను ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని పవన్ స్పష్టం చేశారని చెప్పాలి.