గత కొద్దికాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే వివిధ సంస్థలపై తమదైన శైలిలో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పెద్దలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇటు బీజేపీ, అటు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలపై చేస్తున్న కామెంట్ల పరంపరలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తాజాగా మరో కీలక వ్యాఖ్యల చేశారు. ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని హైదరాబాద్ కంటోన్మెంట్‌కు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో కార్వాన్ నియోజకవర్గంలో నెలకొన్న నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి అడ్డు పడుతున్న కంటోన్మెంట్ అధికారులపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కంటోన్మెంట్లో నాలాలపై చెక్ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతోందన్నారు. కంటోన్మెంట్ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రోడ్లు బంద్ చేస్తే.. తాము కరెంట్, నీళ్లు బంద్ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
ఒక వైపు కంటోన్మెంట్, మరో వైపు ఏఎస్ఐ అడ్డు పడుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్ఐ అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదంటూ మండిపడ్డారు. తెలంగాణ వేరే దేశం అన్నట్టు కేంద్రం విచ్చలవిడిగా ప్రవర్తిస్తోందన్నారు.
‘‘హైదరాబాద్‌లో ఉంటున్నప్పుడు కంటోన్మెంట్ కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇష్టమొచ్చినట్లు రోడ్లు బంద్ చేస్తాం.. నాలాల మీద చెక్ డ్యాంలు కడుతామంటే మేం కూడా ఊరుకోం. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం. అవసరమైతే మంచినీళ్లు, కరెంట్ బంద్ చేస్తాం. అప్పుడైనా దిగిరారా..’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. కంటోన్మెంట్ అధికారులను తక్షణమే పిలిచి మాట్లాడాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తామని కేటీఆర్ చెప్పారు. ఒక వేళ వారు వినకపోతే తీవ్రమైన చర్యలకు, కఠిన చర్యలకు కూడా వెనుకాడొద్దని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున సభలో చెప్తున్నానని కేటీఆర్ అన్నారు.