తెలంగాణ సీఎం కేసీఆర్ గత ఎన్నికల ముందు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తరహాలోనే సీఎం జగన్ కూడా ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళతారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికల ప్రచారంపై వైసీపీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికల ప్రచారం అవాస్తవమని సజ్జల ఖండించారు.
వైసీపీ 12వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న సజ్జల పలు విషయాలపై స్పందించారు. రాజకీయాల్లో అనేక సంస్కరణలను వైసీపీ తెచ్చిందని, ప్రజలకు సేవ చేయడానికే పార్టీ పెట్టామని అన్నారు. నవరత్నాలతో జగన్ వేసిన విత్తనాలు చెట్లయి ఇప్పుడు ఫలాలనిస్తున్నాయని చెప్పారు. మూడేళ్ళుగా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని, అన్ని వర్గాలకు రాజకీయ సాధికారత కల్పించామని చెప్పారు.
టీటీడీని కుప్పంతో సహా అన్ని ప్రాంతాల్లో చెత్తబుట్టలో పడేశారని, అండమాన్ లో ఒక వార్డ్ గెలిస్తే సంబరాలు చేసుకున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు వస్తాయన్న ప్రచారం అమరావతి గ్రాఫిక్స్ వంటిదని, అది చూసి జనం నవ్వుకుంటున్నారని సెటైర్లు వేశారు. టీడీపీ సినిమాకి 2024లో శుభం కార్డు పడబోతుందంటూ సజ్జల జోస్యం చెప్పారు.
వైసీపీకి వీళ్ళేవరు ప్రత్యర్ధులు కారని, వైసీపీ కార్యకర్తలంతా ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ కుట్రలను ప్రజలకు వైసీపీ కార్యకర్తలు వివరించాలని, 2024లో టీడీపీని శాశ్వతంగా తుడిచెయ్యాలని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. జులై లో వైసీపీ ప్లీనరీ జరుగుతుందని, ఆ ఏర్పాట్లు చేసుకోవాలని కార్యకర్తలకు, నేతలకు సజ్జల సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates