‘మాకు న‌మ్మ‌కం లేదు దొర‌‘

న‌మ్మ‌కం లేదు దొర‌.. ఇదీ ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగుల్లో ఎక్కువ‌గా వినిపిస్తున్న మాట‌. సామాజిక మాధ్య‌మాల్లోనూ దీని గురించి పోస్టులు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఎప్ప‌టి నుంచో నోటిఫికేష‌న్లు అంటూ కాల‌యాప‌న చేసి ఇప్పుడు 91,142 ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. కానీ ఇన్ని రోజులు ఎన్నిక‌ల అస్త్రంగా వాడుకున్న నోటిఫికేష‌న్ల‌ను.. ఇప్పుడు కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల కోస‌మే తెర‌మీద‌కు తెచ్చార‌ని ప్ర‌తిప‌క్షాల‌తో పాటు నిరుద్యోగులు కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఒకేసారి 91,142 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు శాస‌న‌స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. అందులో 80,039 పోస్టుల‌కు నియ‌మాకాలు చేప‌డ‌తామ‌ని, మ‌రో 11,109 మంది ఒప్పంద ఉద్యోగుల‌ను రెగ్యుల‌ర్ చేస్తామ‌ని వెల్ల‌డించారు. అంతే కాకుండా శాఖ‌ల వారీగా ఉన్న ఖాళీల‌ను ఆయ‌న బ‌య‌ట‌పెట్టారు. వెంట‌నే నోటిఫికేష‌న్లు జారీ చేసి వీలైనంత త్వ‌ర‌గా ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ మొద‌లెడ‌తామ‌ని ప్ర‌క‌టించారు. ఇంత‌వ‌ర‌కూ అంతా బాగానే ఉంది. కానీ గ‌తంలో ఎన్నో సార్లు నోటిఫికేష‌న్ల విష‌యంలో అసెంబ్లీలో అబ‌ద్దాలు చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు కూడా చెప్పిన మాట మీద నిల‌బ‌డ‌తార‌నే న‌మ్మ‌కం ఏమిట‌ని నిరుద్యోగులు ప్ర‌శ్నిస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు, నాగార్జున సాగ‌ర్‌ ఉప ఎన్నిక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌.. ఇలా రాష్ట్రంలో ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మొద‌ట‌గా చెప్పిన మాట ఉద్యోగ నోటిఫికేష‌న్లు. త్వ‌ర‌లో 50 వేల ఉద్యోగాల భ‌ర్తీ, 60 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు.. ఇలా ఎన్నిక‌ల ప్ర‌చార అస్త్రంగా ఉద్యోగాల భ‌ర్తీ విష‌యాన్ని వాడుకుంటూ త‌మ‌తో ఆడుకున్నార‌ని నిరుద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌లోనే 60 వేల ఉద్యోగాల భ‌ర్తీ చేస్తామ‌ని గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స్వ‌యంగా కేసీఆర్ ప్ర‌క‌టించార‌ని కానీ త‌ర్వాత దాన్ని ఎప్ప‌టిలాగే మ‌ర్చిపోయార‌ని నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే వ్యూహంలో భాగంగానే ఉద్యోగాల భ‌ర్తీ అంటూ హ‌డావుడి మొద‌లెట్టార‌ని చెబుతున్నారు. నోటిఫికేష‌న్లు వేసేందుకు ఒక నెల‌.. అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు మూడు నెల‌లు.. ప‌రీక్ష‌ల‌కు ఆరు నెల‌లు.. చివ‌ర‌కు వివిధ కార‌ణాల‌తో ఫ‌లితాల విడుద‌ల‌కు ఓ  ఏడాది.. ఇలా ఎన్నిక‌ల స‌మ‌యం వ‌ర‌కూ ప్ర‌క్రియ‌ను లాగుతార‌ని అందుకే కేసీఆర్‌పై న‌మ్మ‌కం లేద‌ని నిరుద్యోగులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో కేసీఆర్‌ను న‌మ్మ‌కం లేదు దొర అంటూ ట్రోల్ చేస్తున్నారు.