తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గందరగోళం, నినాదాల మధ్య ప్రారంభమయ్యాయి. తొలిరోజు సభలోనే ఆర్ఆర్ఆర్ త్రయంపై వేటుపడింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ లపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలను ప్రారంభించడంపై ఆ ముగ్గురూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
50 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే హక్కు లేదని విమర్శించారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా వారు అసెంబ్లీలో నినాదాలు చేశారు. దీంతో సమావేశాలకు అడ్డుతగులుతున్నారంటూ ఆ ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేశారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ వెల్లడించారు.
ప్రశ్నించే గొంతులను అణచివేయలేరని, అలా చేస్తే మరింత బలంగా ప్రశ్నిస్తూనే ఉంటామని ఆ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు అన్నారు. తమ మైకులు కట్ చేస్తున్నారని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఈటల విమర్శించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గంటల తరబడి సభలో మాట్లాడారని, సీఎం అయ్యాక నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
అన్ని వర్గాల ప్రజల సమస్యలపై ప్రజలతో కలిసి పోరాడతామని అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ ముందు ఈటల, రాజా సింగ్, రఘునందన్ నిరసనకు దిగారు. కేసీఆర్ సర్కారు తీరును నిరసిస్తూ నినాదాలు చేశఆరు. దీంతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన పోలీసులు వారిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.