ఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యవసరం. తనకు రాజకీయ మనుగడ ఉండాలన్నా.. టీడీపీకి భవిష్యత్ ఉండాలన్నా 2024 ఎన్నికల్లో పార్టీకి గెలుపు కావాలి. దీంతో ఇప్పటికే పార్టీ బలోపేతంపై బాబు సీరియస్‌గా దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ ఇంఛార్జీలను నియమిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా గన్నవరంపై బాబు ఫోకస్ చేసినట్లు తెలిసింది. గన్నవరంలో మొదటి నుంచి టీడీపీకి మంచి పట్టుంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీడీపీ అక్కడ గెలిచింది. కానీ 2019లో గెలిచిన తర్వాత వల్లభనేని వంశీ వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. దీంతో అక్కడ వంశీకి చెక్ పెట్టేందుకు మరో నేత కోసం బాబు అన్వేషణ మొదలెట్టారు.
అక్కడ గెలవాలని..
2024 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి ఎలాగైనా గెలవాలని బాబు పట్టుదలతో ఉన్నారు. అందుకోసం గత కొన్ని రోజులుగా అభ్యర్థి అన్వేషణలో బాబు పడ్డారు. ఆ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. అందుకే అక్కడ మంచి అభ్యర్థిని నిలబెడితే గెలవడం ఖాయమని బాబు భావిస్తున్నారు. వంశీ పార్టీకి దూరమైన తర్వాత అక్కడ తాత్కాలిక ఇంఛార్జీగా బచ్చుల అర్జునుడిని బాబు నియమించారు. కానీ బీసీ సామాజికవర్గానికి చెందిన అర్జునుడికి వంశీని తట్టుకునే స్థాయి లేదని అక్కడి క్యాడర్ అభిప్రాయపడుతోంది. అందుకే అక్కడ వంశీపై పోటీకి గద్దె రామ్మోహన్ లేదా దాసరి బాలవర్థన రావు పేర్లను బాబు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
గతంలో విజయం..
గన్నవరం నుంచి గతంలో గద్దె రామ్మోహన్ గెలిచారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించారు. అయితే ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కానీ సామాజికపరంగా, ఆర్థికంగా రామ్మోహన్ ధీటైన అభ్యర్థి అని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి ఆయన మరోసారి గన్నవరం వెళ్తారా? అన్నది సందేహమే. మరో కమ్మ సామాజికవర్గం నేత దాసరి బాలవర్థనరావు పేరు కూడా వినిపిస్తోంది. 1999లో గన్నవరంలో దాసరి గెలిచారు. కానీ 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలో యాక్టివ్‌గా లేరని తెలిసింది. అందుకే ఆయన్ని తిరిగి టీడీపీలోకి తీసుకొచ్చి పోటీ చేయిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి అందుకు ఆయన ఒప్పుకుంటారా? అన్నది చూడాలి.