కరోనా మహమ్మారిని పుట్టించిన చైనా.. దాన్నుంచి తేలిగ్గానే బయటపడ్డట్లు కనిపించింది. కరోనాకు కేంద్రమైన వుహాన్ నగరం మొదట్లో ఈ మహమ్మారి ధాటికి అల్లాడినప్పటికీ.. లాక్ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడంతో వైరస్‌ను పారదోలడంలో విజయం సాధించినట్లు చెప్పుకుంది.
అంత పెద్ద చైనా దేశంలో కరోనా ఇతర నగరాలకు విస్తరించలేదు. మొత్తంగా కేసులు లక్ష కూడా దాటలేదు. మరణాలు 5 వేల లోపే ఉన్నాయి. ఇది ప్రపంచానికి చైనా చెప్పిన లెక్క. ఈ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమైనా సరే.. చైనా మాత్రం బయటి ప్రపంచానికి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లుగానే కనిపించింది.
కానీ కొంత విరామం తర్వాత ఇప్పుడా దేశం మళ్లీ కరోనా ధాటికి అల్లాడుతున్నట్లు కనిపిస్తోంది. వుహాన్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలో.. ఏ ఇబ్బందీ లేకుండా కార్యకలాపాలు నడిపిన బీజింగ్ నగరం ఇప్పుడు వైరస్ బారిన పడి పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఈ మధ్యే బీజింగ్‌లో తొలి కరోనా కేసు నమోదు కాగా.. కొన్ని రోజుల్లోనే అక్కడ కరోనా కేసులు అమాంతం పెరిగాయి. బుధవారం ఒక్క రోజే 31 కేసులు నమోదయ్యాయి.
కేసులు రెండంకెల సంఖ్యకు చేరాయి అంటే.. ఇక త్వరలోనే వందలు, వేల సంఖ్యకు పెరగడం లాంఛనమే అవుతుంది. ఇప్పటికే కరోనా వ్యాప్తిపై పూర్తి అవగాహనతో ఉన్న చైనా.. బీజింగ్ విషయంలో అప్రమత్తం అయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్కూళ్లను మూసేసింది. ఆ నగరానికి వచ్చి పోయే విమానాలన్నింటినీ రద్దు చేసేసింది.
ఏకంగా 1255 విమానాలు రద్దయ్యాయి. బయటి ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చిన విమాన ప్రయాణీకులందరినీ క్వారంటైన్‌కు పంపింది. ఇంతకుముందు వుహాన్‌లో అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేసింది చైనా. ప్రజల్ని వారి వారి ఇళ్లలో పెట్టి బయట తాళాలు వేసేసింది. ఆన్ లైన్ ఆర్డర్లు, ప్రభుత్వం ఇచ్చే సరకులు, ఆహార పదార్థాలతో వాళ్లు రెండు నెలలకు పైగా కడుపు నింపుకున్నారు. బీజింగ్‌లో కరోనా వ్యాప్తి పెరిగితే ఇక్కడా అలాగే చేసే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates