ఒక వైపు కోర్టు ఆదేశాలు.. మరోవైపు.. రాజధాని రైతుల ఆవేదన.. వెరసి.. రాజధాని అమరావతి విషయంలో స్పష్టత వచ్చింది. అయినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేస్తోంది. మాడు రాజధానుల అంశంపై పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. ముమ్మాటికీ పాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతల అభిప్రాయాలు తమ ప్రభుత్వానికి ప్రామాణికం కాదని.. శివరామకృష్ణ కమిషన్ కూడా వికేంద్రీకరణను సూచించిందని వెల్లడించారు.
ముమ్మాటికీ పాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స మరోసారి స్పష్టం చేశారు. 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేది తమ లక్ష్యమన్నారు. శివరామకృష్ణ కమిషన్ కూడా వికేంద్రీకరణను సూచించిందని వెల్లడించారు. ప్రతిపక్ష నేతల అభిప్రాయాలు తమ ప్రభుత్వానికి ప్రామాణికం కాదని పునరుద్ఘాటించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం స్వార్థం కోసం పోలవరాన్ని, ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టిందని విమర్శించారు.
జిల్లాల పునర్విభజనపై వస్తున్న విజ్ఞప్తులను కమిటి పరిశీలిస్తోందని తెలిపారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుందని మంత్రి బొత్స వెల్లడించారు. మరోవైపు.. అమరావతిపై హైకోర్టు తీర్పును చూస్తే.. శాసన అధికారాల్లోకి న్యాయవ్యవస్థ జోక్యం చేసుకున్నట్లు అనిపిస్తోందని అధికార పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు.
దీనిపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్కు ఆయన లేఖ రాశారు. రాజ్యాంగం ప్రకారం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు స్పష్టమైన పరిధులు ఉన్నాయన్న ధర్మాన.. వీటిని అతిక్రమించడానికి వీల్లేదన్నారు. కాబట్టి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం పరిధి, వాటి బాధ్యతలు, అధికారాలపై చర్చించాలని కోరారు.