పోలవరం: కేంద్రమంత్రి మాటలు నమ్మచ్చా?

‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపైసా కేంద్రమే భరిస్తుంది’ ఇది తాజాగా కేంద్ర జలశక్తి మంత్ర గజేంద్రసింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు జగన్మోహన్ రెడ్డితో కలిలి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనేక మాటలు చెప్పారు, హామీలూ ఇచ్చారు. వీటన్నింటిలోను ముఖ్యమైనది ఏమిటంటే ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతిపైనా కేంద్రమే భరిస్తుందనేది.

ఇక్కడే మంత్రి మాటల నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే మొదటినుండి కేంద్రమంత్రులు చెబుతునే ఉన్నారు. ఇంతకుముందు జలశక్తి మంత్రులు కూడా పోలవరం సందర్శన సందర్భంగా హామీలిచ్చారు. తీరా నిదుల కోసం ఢిల్లీ వెళితే అక్కడ సవాలక్ష కొర్రీలు వేస్తారు. పోలవరం ప్రాజెక్టు అథారిటి పంపిన బిల్లులను మంజూరుచేయరు. బిల్లుల్లో భారీగా కోతలు వేసి వాళ్ళిష్టం వచ్చినపుడు మంజూరు చేస్తారు. 2017-18 సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయాన్ని రు. 55,548 కోట్లుగా ఫైనల్ చేయమని రాష్ట్రప్రభుత్వం కోరుతున్నా కేంద్రం పట్టించుకోవటంలేదు.

ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన నిర్వాసితుల పునరావాసానికి అయ్యే ఖర్చును తాము ఇచ్చేది లేదని ఒకపుడు కేంద్రం స్పష్టంగా చెప్పేసింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం పెద్దఎత్తున పోరాటం చేసినా కేంద్రం అభ్యంతరాలు చెబుతునే ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించాలని రాష్ట్రప్రభుత్వం అడుగుతునే ఉన్నా కేంద్రంనుండి సానుకూల నిర్ణయమైతే రాలేదు. తాజా పర్యటనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు.

మొత్తానికి కేంద్రమంత్రులు పర్యటించిన సమయంలో ఏదో హామీలిచ్చేయటం, ఢిల్లీకి తిరిగెళ్ళిన తర్వాత మరచిపోవటం మామూలైపోయింది. మరి తాజా పర్యటన తర్వాత షెకావత్ ఏమి చేస్తారో చూడాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టు పురోగతిని మూడు నెలలపాటు వ్యక్తిగతంగా తానే పరిశీలిస్తానని చెప్పారు. నిజంగా మంత్రి ఆపని చేస్తే ప్రాజెక్టుకే మంచిది. అలాగే సవరించిన అంచనాలు రు. 55 వేల కోట్లకు కూడా కేంద్ర ఆర్ధికశాఖతో ఆమోదముద్ర వేయిస్తే నిధుల సమస్య కూడా తీరుతుంది. మరి షెకావత్ ఏమి చేస్తారో చూడాల్సిందే.