ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని అన్నారు. వివేకా హత్యపై తాజాగా బయటకు వస్తున్న వాంగ్మూలాలతో జగనే దోషి అనేది స్పష్టంగా అర్ధం అవుతోందని చంద్రబాబు అన్నారు. కేసును మొదటి నుంచి తప్పుదోవ పట్టిస్తున్న జగన్ ను సిబిఐ విచారించాలన్నారు. నాడు సిఎంగా ఉన్న తనపై హత్యానేరం మోపి జగన్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందారనేది రుజువయ్యిందన్నారు.
తండ్రి హత్యపై న్యాయం చెయ్యాలని కోరిన సునీత పట్ల అన్నగా వ్యవహరించిన తీరుతో జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారని చంద్రబాబు దుయ్యబట్టారు. విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడే హక్కు గాని, సిఎం చైర్ లో కూర్చునే అర్హత గాని జగన్ కు లేవని చంద్రబాబు మండిపడ్డారు. హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తే… ఏమవుతుంది.. నాపై 12వ కేసు అవుతుంది అని జగన్ వ్యాఖ్యానించడం అతనికి చట్టం అంటే లెక్కలేనితనాన్ని, తన అవినీతి డబ్బుతో దేనినైనా మేనేజ్ చేయగలననే అహంకారాన్ని స్పష్టం చేస్తోందని చంద్రబాబు అన్నారు.
వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్ ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని చంద్ర బాబు డిమాండ్ చేశారు. బాబాయ్ హత్యలో సూత్రధారి ఎవరో అనేది ఇప్పుడు తేలిపోయిందని.. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. నాడు గ్యాగ్ అర్డర్ తేవడం నుంచి.. ఇప్పుడు సిబిఐ విచారణను తప్పు పట్టడం వరకు హత్య కేసులో జగన్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు డైవర్ట్ పాలిటిక్స్ అమలు చేస్తున్న జగన్.. ఈ విషయంలో ప్రజలను ఏమార్చలేరని అన్నారు.
హత్యను పాత్రధారులకే పరిమితం చేసి సూత్రధారుల్ని బోనులో నిలబెట్టకపోతే రాష్ట్రంలో ఏ పౌరుని ప్రాణాలకైనా రక్షణ ఉంటుందా? వైఎస్ కోటలోనే వైఎస్ తమ్ముణ్మి హత్యచేయడం అంత:పుర పెద్ద ప్రోత్సాహం లేకుండా సాధ్యమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates