తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సారు.. కారు.. పదహారు అనే నినాదాన్ని ఎత్తుకుందా..? వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 16 లోక్ సభ సీట్లే టార్గెట్ గా పెట్టుకుందా..? అందుకే కేసీఆర్ ఇటీవల దేశ రాజకీయాలపై దృష్టి పెట్టారా..? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు.2018లో గడువు కంటే ఆరునెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ బంపర్ మెజారిటీ సీట్లు సాధించింది.
88 సీట్లతో ఏకపక్ష విజయం సాధించింది. టీఆర్ఎస్ సునామీలో ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయి. ఇదే అదనుగా 2019 లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించి సరికొత్త నినాదాన్ని ఎత్తుకుంది. సారు.. కారు.. పదహారు నినాదంతో లోక్ సభలో 16 సీట్లను గెలుచుకోవాలని భావించింది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో ఒకటి హైదరాబాద్ ఎలాగూ మిత్రపక్షం ఎంఐఎం గెలుస్తుంది కాబట్టి అది మినహాయించి మిగతా 16 స్థానాలపై కన్నేసింది. అయితే ఆర్నెల్లు తిరగకుండానే టీఆర్ఎస్ ఉత్సాహానికి అడ్డుకట్ట పడింది. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ 9 స్థానాలకే పరిమితం అయింది. మిగతా స్థానాల్లో బీజేపీ నాలుగు.., కాంగ్రెస్ మూడు గెలుచుకుని అధికార పార్టీని నిలువరించాయి.
తాజాగా మళ్లీ సారు.. కారు.. పదహారు నినాదాన్ని ఎత్తుకోవాలని భావిస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా 16 స్థానాలు గెలిచి తమ పట్టు నిరూపించుకోవాలని యోచిస్తోంది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీల పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ఎంపీ స్థానాలను గెలుచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. అన్ని చోట్లా గెలిస్తేనే తన ప్రతిష్ఠ ఇనుమడిస్తుందనే భావనలో కేసీఆర్ ఉన్నారు. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే అన్ని స్థానాలూ గెలవక తప్పదని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు టీఆర్ఎస్ గెలవని ఎంపీ స్థానాలపై గురి పెట్టింది. నల్లగొండ, మల్కాజిగిరి, సికింద్రాబాద్ స్థానాల్లో కారు పార్టీ ఇంత వరకు బోణీ కొట్టలేదు. వీటితో పాటు క్రితం ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన, ఓడిన స్థానాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అలాగే.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచినా ఎంపీలు ఓడిపోవడంపై ఇప్పటికీ జీర్ణించుకోవడం లేదు. వీటన్నింటినీ అధిగమించేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఈ ప్రయత్నంలో టీఆర్ఎస్ ఎంత వరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.