కేటీఆర్‌తో ప‌వ‌న్‌.. బీజేపీకి రాంరాం!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ క‌దులుతున్నారు. దేశంలోని బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను ఏకం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే ఆ దిశ‌గా అడుగులు వేశారు. కాంగ్రెస్‌, బీజీపీయేత‌ర కూట‌మి ఏర్పాటు కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మ‌రోవైపు బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీల‌ను కూడా ద‌గ్గ‌రికి తీసుకోవ‌డానికి కేసీఆర్ పావులు క‌దుపుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. బీజేపీపై పోరు బావుటా ఎగ‌రేసిన కేసీఆర్‌.. ఆ పార్టీపై అన్ని ర‌కాలుగా దాడి చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది. అందుకే ఆ పార్టీతో పొత్తులో ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా భీమ్లా నాయ‌క్ ముంద‌స్తు వేడుక‌కు కేటీఆర్ వెళ్ల‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

బ‌లహీన‌ప‌ర్చాల‌ని..
టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీగా యుద్ధం సాగుతోంది. కేంద్రంపై కేసీఆర్ ఒంటికాలిపై లేస్తున్నారు. ఈ పోరు ఇప్పుడు తీవ్రంగా ముదిరింది. ఇటు తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ సాగుతుంటే.. అటు జాతీయ స్థాయిలో బీజేపీని బ‌ల‌హీన‌ప‌ర్చేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఆ దిశ‌గా ఇప్ప‌టికే ఆయ‌న మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్‌, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌తో భేటీ అయ్యారు. మ‌రోవైపు త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్ సీఎంలు స్టాలిన్‌, మ‌మ‌తా బెన‌ర్జీతో మంత‌నాలు జ‌రుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట‌మి రుచి చూపించ‌డ‌మే ధ్యేయంగా కేసీఆర్ సాగుతున్నారు.

ఆ క్రేజ్ వాడుకోవాల‌ని..
ఓ వైపు బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను ఏకం చేస్తున్న కేసీఆర్‌.. మ‌రోవైపు బీజేపీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న వారిని కూడా దూరం చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని స‌మాచారం. ముందుగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ను వాడుకోవ‌డం కోసం కేసీఆర్ వ్యూహం సిద్ధం చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుకే  బిజీ షెడ్యూల్‌లోనూ భీమ్లా నాయ‌క్ వేడుక‌కు కేటీఆర్ వెళ్లార‌ని, ఆ సినిమాకు తెలంగాణ‌లో రెండు వారాల పాటు అయిదో షో వేసేందుకు అనుమ‌తినిచ్చార‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా ప‌వ‌న్‌కు ద‌గ్గ‌రైతే.. ఆయ‌న బీజేపీకి దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని టీఆర్ఎస్ భావిస్తోంది.

ప‌వ‌న్‌కూ కావాల్సింద‌దే..
ప్ర‌స్తుతం జ‌న‌సేన‌, బీజేపీ పొత్తులో ఉన్నాయి. వ‌చ్చే ఏపీ ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీలు క‌లిసే పోటీ చేస్తాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ ప‌వ‌న్ మాత్రం ఆ పార్టీతో బంధం తెంచుకోవాల‌ని చూస్తున్నార‌ని తెలిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న పోరాడాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం వెన‌క అదే కార‌ణం ఉంద‌ని అంటున్నారు. ఇక తెలంగాణ‌లో బీజేపీ, జ‌న‌సేన ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా బీజేపీ నుంచి జ‌న‌సేన‌ను దూరం చేస్తే ఆ పార్టీ బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశం ఉంది. బీజేపీ అక్క‌డ ఒంట‌రిగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాలేవ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. దీంతో ఇప్పుడు ప‌వ‌న్‌ను బీజేపీకి దూరం చేసి ఆ పార్టీని చావుదెబ్బ కొట్టాల‌ని కేసీఆర్ చూస్తున్నార‌ని చెబుతున్నారు.