గ్రేటర్ హైదరాబాద్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. క్షేత్ర స్థాయి కార్యక్రమాల్లో వేగం పెంచుతూ శ్రేణుల్ని అప్రమత్తం చేస్తోంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీనియర్లు అహర్నిశలు కృషి చేస్తున్నారు. పాత కాపులను క్రియాశీలం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇటీవల తెలంగాణలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపడితే అత్యల్పంగా సికింద్రాబాద్ లోనే నమోదు అయ్యాయి. పార్లమెంటు స్థానాల పరిధిలో సభ్యత్వాలలో నల్లగొండ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో పెద్దపల్లి, మల్కాజిగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు నాలుగు లక్షల సభ్యత్వాలతో ముందంజ వేశాయి. అత్యల్పంగా నమోదు అయిన వాటిల్లో ఆదిలాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాలు నిలిచాయి. ఇక్కడ కేవలం లక్ష లోపే సభ్యత్వాలు నమోదు అయ్యాయి.
దీంతో అధిష్ఠానం అప్రమత్తం అయింది. కారణాలను తెలుసుకునేందుకు పార్టీ పెద్దలను, సీనియర్లను రంగంలోకి దించింది. పార్టీ కార్యక్రమాల పట్ల.. రాజకీయాల పట్ల ఉత్సాహం చూపకుండా సైలెంట్ అయిన నేతలను కదిలించే పనిలో పడింది. ఇందులో భాగంగా సనత్ నగర్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, గోషామహల్, సికింద్రాబాద్ స్థానాలపై తక్షణం దృష్టి సారించింది.
ఈ నియోజకవర్గాలు ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటలు. క్రమంగా వీటికి బీటలు వారి ఒక్క చోట కూడా పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. అన్నీ గులాబీ ఖాతాలో పడ్డాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ స్థానాల పరిధిలో క్రితం ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేక చతికిలపడింది. ఈసారి ఎలాగైనా అత్యధిక స్థానాల్లో గెలిచి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని సంకల్పించింది.
ఇందులో భాగంగా ఇటీవల రేవంత్ జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని కలిసి యాక్టివ్ రోల్ తీసుకోవాలని కోరారు. తాజాగా ఇపుడు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, మాజీ మంత్రి గీతారెడ్డి రంగంలోకి దిగారు. సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఆ వెంటనే ముషీరాబాద్ పై సమీక్ష చేశారు. అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు చేయాలని ఆదేశించారు.
త్వరలో గోషామహల్ పై దృష్టి పెట్టనున్నారు. ఇలా గ్రేటర్ లోని మిగతా స్థానాల్లో కూడా వరుస సమీక్షలు నిర్వహించి.. శ్రేణుల్ని యాక్టివ్ చేసి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని.. ఎక్కువ స్థానాల్లో విజయమే టార్గెట్ గా పనిచేయాలని పార్టీ భావిస్తోంది. చూడాలి మరి వారి కోరిక ఏ మేరకు నెరవేరుతుందో..!