ప‌వ‌న్ స‌క్సెస్… అభిమానులు ఫెయిల్ !

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌స్తున్నారంటే ఓ ప్ర‌భంజ‌నం. ఆయ‌న మాట్లాడుతున్నారంటే ఒకటే ఈల‌లు,గోల‌లు.ఆయ‌న చెప్పింది వినే అభిమానులు క‌న్నా ఆయ‌నను చూసి త‌రించిపోవాల‌ని భావించే వాళ్లే ఎక్కువ.దీంతో ప‌వ‌న్ తరుచూ అస‌హ‌నంలోనే ఉండిపోతున్నారు. ద‌య‌చేసి మీరు ప‌వ‌ర్ స్టార్ అని అర‌వ‌డం మానుకోండి.ప‌వ‌ర్ లేని నాకు ప‌వ‌ర్ స్టార్ అని పిలిపించుకునే అర్హ‌త లేదు..మీరు అలా పిల‌వ‌కండి అని ఎన్నో సార్లు మొత్తుకున్నారు ఆయ‌న‌.

అదేవిధంగా  సీఎం సీఎం అని అర‌చి గోల చేసినా కూడా వ‌ద్దు ప్లీజ్.. నేను అయిన‌ప్పుడు మీరు అర‌వండి ఇప్పటి నుంచి వ‌ద్దు అని కూడా అంటారాయ‌న‌. ఇవేవీ ప‌ట్టించుకోని ఓ నిద్రాణవ‌స్థ‌లో ప‌వ‌న్ అభిమానులు ఉంటారు. ఇంకా చెప్పాలంటే నిర్ల‌క్ష్య ధోర‌ణిలో ప‌వ‌న్ అభిమానులు ఉంటారు. ముఖ్యంగా ఆయ‌న నిన్న స‌భ‌లో చాలావిష‌యాలు చెప్పారు.

 ప్ర‌భుత్వ విధానాల‌ను ద‌శ‌ల వారీగా వివ‌రించే ప్రయ‌త్నం చేశారు.ఇదే స‌మ‌యంలో రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేశారు.వీటిపై ఇప్ప‌టికే వైసీపీ కౌంట‌ర్లు ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. అదంతా రాజకీయ‌పార్టీల యుద్ధం. దీన్నెవ‌రూ కాద‌న‌రు కానీ ప‌వ‌న్ ఏం మాట్లాడినా వాటిని సొంతం చేసుకుని అర్థం చేసుకుని మ‌ళ్లీ అవే విష‌యాల‌పై క్షేత్ర స్థాయిలో పోరాడేవారు లేరు. జీఓ 217 కాపీని నిన్న‌టి వేళ ఆయ‌న చించేశారు.ఆ జీఓ ఏం చెబుతుంది ఆ జీఓ కార‌ణంగా న‌ష్ట‌పోయే మ‌త్స్య‌కారుల‌కు ప్ర‌త్యామ్నాయం ఏంటి? అస‌లు జెట్టీల నిర్మాణానికి ప్ర‌భుత్వం ఎందుకు అల‌స‌త్వం వ‌హిస్తుంది? తీర ప్రాంత భూములు ఎందుకు అన్యాక్రాంతం అవుతున్నాయి? చేప‌ల చెరువులు పెద్ద‌ల చేతుల్లోకి ఎందుకు వెళ్తున్నాయి? ఇలా ఎన్నోవిష‌యాల‌ను ఆయ‌న వివ‌రించే ప్ర‌య‌త్నంచేశారు.

వీట‌న్నింటిపై స‌గ‌టు జ‌న‌సేన అభిమాని పోరాడాలంటే అవ‌గాహ‌న కావాలి..అధ్య‌య‌నం కావాలి..తీర ప్రాంత స‌మ‌స్య‌ల‌పై క్షేత్ర స్థాయి అవ‌గాహ‌న ఉండాలి..ఇవేవీ లేకుండా అరుస్తాం అంటే కుద‌రదు. ఇప్పుడు ప‌వ‌న్ అభిమానులు చేస్తున్న‌ది అదే! వెర్రిమొర్రి అరుపులు త‌ప్ప వీళ్లు సాధిస్తున్న‌ది ఏమీ లేదు. వాళ్ల‌ను తాను నియంత్రించే ప్ర‌య‌త్నం చేస్తున్నా కూడా అవేవీ ఫ‌లించ‌డం లేదు.