వైసీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహార శైలి కొంతకాలంగా చర్చనీయాంశమవుతోనన సంగతి తెలిసిందే. తన సంచలన వ్యాఖ్యలతో, చర్యలతో రఘురామకృష్ణం రాజు పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో పార్లమెంట్ సమావేశాల తెలుగు భాషకి సపోర్ట్ గా మాట్లాడుతూ జగన్ కు షాక్ ఇచ్చారు. విజయసాయి రెడ్డికి చెప్పకుండా కేంద్రమంత్రులు,ప్రధానిని కలవద్దని సీఎం జగన్ స్వయంగా చెప్పినా…రఘురామకృష్ణం రాజు వినకుండా ప్రధాని మోడీకి పాదాభివందనం చేసి…పలువురు కేంద్ర మంత్రులను కలిశారు.
సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ హోదాలో, ఢిల్లీలో బీజేపీ సహా అన్ని పార్టీల ఎంపీలకు సదరు ఎంపీ విందు ఇవ్వడంతో వైసీపీలో ఈ నేతపై చర్చ మొదలైంది. ఆ విందుకు విజయసాయి రాలేదని, విజయసాయి రెడ్డికి, రఘురామకృష్ణం రాజుకి గ్యాప్ ఉందని పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ వచ్చిన రఘు రామ కృష్ణం రాజు బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో తాజాగా సొంతపార్టీపై రఘు రామ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీలో చేరాలనుకోలేదన్న రఘు రామ కృష్ణం రాజు .. ఆ పార్టీ నేతలు బతిమిలాడి మరీ తనను వైసీపీలో చేర్చుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘు రామ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం జగన్ చాలాసార్లు ఫోన్ చేసి వైసీపీలో చేరాలని కోరారని, అందుకే చేరారని అన్నారు. తాను కాకుండా నర్సాపురంలో వేరెవరు పోటీ చేసినా ఓడిపోయేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ జగన్ దయతోనే రఘురామ కృష్ణం రాజు ఎంపీ అయ్యారని, పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ అయ్యారని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు చేసిన వ్యాఖ్యలపై రఘు రామ కృష్ణం రాజు స్పందించారు. తనపై చేసిన వ్యాఖ్యలతో ప్రసాదరాజుకు త్వరలోనే మంత్రిపదవి వస్తుందని, ప్రసాదరాజు వెనుక ఉన్నది ఎవరో తనకు తెలుసని అన్నారు. కొందరు నేతల్లాగా ప్రజల మీదపడి డబ్బులు కలెక్ట్ చేయడం తన పద్ధతి కాదని, అటువంటి సొమ్ముతో ఫోటోలు దిగడానికి వెళ్ళలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్‌తో ప్రత్యేకంగా మాట్లాడదామనుకున్నానని, టైమ్ ఇవ్వలేదని అన్నారు. ప్రసాదరాజుకి మంత్రి పదవి రావాలని సెటైర్ వేశారు. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలపై జగన్ ఫోకస్ పెట్టకుంటే…రాబోయే కాలంలో పార్టీకి నష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. .
Gulte Telugu Telugu Political and Movie News Updates