కొద్దిరోజులుగా కేసీయార్ మీడియా సమావేశాలు లేదా బహిరంగ సభల్లో ప్రసంగాలు వింటుంటే ఒక డౌటు పెరిగిపోతోంది. అదేమిటంటే ఎక్కువగా బీజేపీని ప్రధానంగా నరేంద్రమోడిని మాత్రమే డైరెక్టుగా ఎటాక్ చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ మీద దాడిని తగ్గించటమే కాకుండా కాస్త సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. కేసీయార్ వైఖరిపై రెండు విషయాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.
అదేమిటంటే మొదటిది కాంగ్రెస్ కన్నా బీజేపీనే ఎక్కువ ప్రమాదమని అనుకుంటున్నట్లున్నారు. ఇక రెండోది జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్న కేసీయార్ కాంగ్రెస్ తో సఖ్యతను కోరుకుంటున్నారా ? అనే డౌట్లు పెరిగిపోతున్నాయి. ఈ కారణాలతోనే తన దాడులు మొత్తం బీజేపీ మీదనే చేస్తున్నట్లున్నారు. మీడియా సమావేశాల్లో గానీ, బహిరంగసభల్లో కానీ అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధిపైన చేసిన అనుచితమైన వ్యాఖ్యలను పదే పదే ప్రస్తావిస్తుండటమే సాక్ష్యంగా అనుకోవాలి.
బీజేపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అగ్రనేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసీయార్ స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యర్ధులపై నోరుపారేసుకోవటంలో కేసీయార్ కూడా ఏమీ తక్కువ తినలేదు. నోటికేదొస్తే అది మాట్లాడేసి ఇదంతా ఉద్యమంలో భాగమనో, ఉద్యమాలు నడిపిన వాళ్ళకిదంతా సహజమే అనో చాలాసార్లు సమర్ధించుకున్నారు. అలాంటి కేసీయార్ రాహుల్ విషయంలో ఇంత మద్దతుగా మాట్లాడుతున్నారంటేనే అనుమానాలు మొదలయ్యాయి.
ఇక రాష్ట్రానికి సంబంధించి కూడా తన ఎటాక్ ఎక్కువగా బీజేపీ చీఫ్ బండి సంజయ్ గురించే ఉంటోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్తావనను కేసీయార్ పెద్దగా తేవటంలేదు. బండి లాగే రేవంత్ కూడా కేసీయార్ ను ఎటాక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రేవంత్ మాటలకు కేసీయార్ పెద్దగా రియాక్టవ్వటంలేదు. బహుశా బీజేపీతోనే తనకు ఎక్కువ ప్రమాదమని కేసీయార్ అనుకుంటున్నట్లున్నారు. పైగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని అనకుంటున్న కేసీయార్ కు కాంగ్రెస్ తో దోస్తానా లేకుండా సాధ్యంకాదు. అందుకనే బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే కేసీయార్ పావులు కదుపుతున్నట్లున్నారు.